2 Jul 2015

మన సంజయ్ తుమ్మ గురించి కొంచెం


ఇరవై రెండు కోట్ల హిట్స్‌.. కోట్ల రూపాయల ఆదాయం.. అదీ ఒక వంటల షోకి. ఆ చెఫ్‌ ఎవరో కాదు. మన హైదరాబాద్‌ వాడే. పేరు సంజయ్‌ తుమ్మ. యూట్యూబ్‌లో రెండు వేల వంటలకు పైగా పెట్టి గృహిణుల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న సంజయ్‌ని నవ్య పలకరించింది.. అప్పుడు ఆయన చెప్పిన కబుర్లు ఇవి..

చిన్నప్పుడు పిల్లలందరికీ వంట చేయాలని ఉంటుంది. నేను కూడా ఆమెట్లలాంటివి వేస్తూ ఉండేవాడిని. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు మా అమ్మ హాస్పిటల్‌లో జాయిన్‌ అవ్వాల్సి వచ్చింది. చెల్లి నా కన్నా చిన్న. అన్నయ్యకు వంటిల్లంటే చిరాకు. నాన్నకు ఆఫీసు, హాస్పిటల్‌లో పనులతో క్షణం తీరిక ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను మొదటిసారి వండటం మొదలుపెట్టా. కుక్కర్‌కి గ్యాస్‌కట్‌ పెట్టడం మర్చిపోయా. కుక్కర్‌ పేలింది. అది నా తొలి వంట అనుభవం. ఆ తర్వాత మూడు నెలల పాటు నేనే వంట చేశా. అమ్మనాన్న వద్దంటున్నా వినకుండా నేనే వంట చేసేవాడిని. నేను చెఫ్‌ అవ్వడానికి తొలి అడుగు పడింది అప్పుడే. చాలా మంది గమనించరు కానీ.. వంట చేసే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వంట చేసే సమయంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. నేను పెద్దయిన తర్వాత ఐటీసీ గ్రూప్‌లో చెఫ్‌గా చేరా. కొద్దికాలం ఇండియాలో ఉండి తర్వాత అమెరికా వెళ్లిపోయా. అక్కడ నాకు నాలుగు రెస్టారెంట్లు ఉండేవి. ఆ సమయంలో యూట్యూబ్‌లో వంటలు పెడుతూ ఉండేవాడిని. వంట చేయటం, షూటింగ్‌, ఎడిటింగ్‌ - అన్నీ నేనే. వాటికి విపరీతమైన ఆదరణ వచ్చింది.
నా దృష్టిలో వంట ఒక పని కాదు. వంట ధ్యానంలాంటిది. దృష్టి పెట్టి ఆస్వాదించగలిగితే దాని నుంచి వచ్చే ఆనందం అనంతం. అసలు మన భారతీయ వంటల్లో ఉన్నంత వైవిధ్యం ప్రపంచంలో మరే దేశంలోను లేదు. ఉదాహరణకు వంకాయలు తీసుకుందాం. వంకాయలతో మన వాళ్లు నాలుగైదు రకాల కూరలు, పులుసులు చేస్తారు. గుజరాతీలు మరో ఐదారు రకాలు చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే- వంకాయలతో చేయదగిన వంటలే వందకుపైగా అవుతాయి. మిగిలిన సంస్కృతులలో ఇంత వైవిధ్యం ఉండదు. మనకు ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు కొన్ని రకాల వంటలే ఎందుకు వండుకుంటాం? మిగిలినవి ఎందుకు వండుకోం?- ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనికి కొన్ని సామాజిక కారణాలున్నాయి. ఒకప్పుడు మహిళలు బయటకు వెళ్లి పనిచేసేవారు కారు. వారికి తెలిసిన విద్య అంతా తల్లితండ్రుల నుంచే వచ్చేది. అంటే- ప్రతి కుటుంబానికి వంట చేయటంలో కూడా ఒక్కో సంప్రదాయం ఉండేది. ఖాళీ సమయాలలో ఎక్స్‌పరిమెంట్స్‌ కూడా చేసేవారు. కానీ కాలం మారింది. మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టారు. దీనితో వారికి తీరిక తగ్గింది. ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్లే మహిళలకు రకరకాల వంటలు చేసే తీరిక ఎక్కుడుంటుంది? అయితే టెక్నాలజీ బాగా పెరగటం వల్ల వంటింటికి సంబంధించిన రకరకాల దినుసులు, పొడులు, పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. 20 ఏళ్ల క్రితం మార్కెట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ దొరికేది కాదు. ఎవరైనా ఇంట్లో చేసుకోవాల్సిందే. ఆ పేస్ట్‌ చేసుకోవటానికి సమయం లేనివారు.. దాంతో చేసే కూరలు మానేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కానీ చేయటానికి తీరిక లేదు. అలాంటప్పుడు సులభమైన వంటలు చేయటానికే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. బహుశా నా వీడియోలకు అంత ఆదరణ రావటానికి కారణం ఇదే కావచ్చు. నెట్‌ ఉన్నవారందరికీ రకరకాల వంటలు అందుబాటులోకి వచ్చాయి.
2007లో అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అసలు వెబ్‌సైట్‌ గురించి కానీ షో గురించి కానీ అనుకోలేదు. విశ్రాంతి జీవితం గడపాలనేది నా ప్లాన్‌. ఆ సమయంలో కొందరు అనాధ పిల్లలకు సాయం చేయా లనుకున్నా. వారికి సాయం చేయాలంటే నాకు సంపాదనుండాలి. దాంతో షో చేయటం మొదలుపెట్టా. బహుశా ప్రపంచంలో అతి ఎక్కువ మంది చూసే వంటల వీడియోలు నావేనెమో! యూట్యూబ్‌లో వ్యూస్‌ను బట్టి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నేను ఆదాయం కోసం మాత్రమే పనిచేయటం లేదు. మన ఆహారం మీద ఉన్న ఆసక్తితో షోలు చేస్తున్నా. ఇప్పటి దాకా నేను యూట్యూబ్‌లో రెండు వేల వీడియోలు పెట్టా. వాస్తవానికి ఇవి మనకు తెలిసిన వంటల్లో ఒక శాతం కూడా కాదు. ఇప్పటి తరంలో చాలా మంది వంట చేయటం చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ప్రతి రోజు ఉదయం పది నిమిషాలు, రాత్రి పడుకొనే ముందు పది నిమిషాలు ప్లాన్‌ చేసుకుంటే చాలు. వంటంతా గంటలో పూర్తి చేయచ్చు. చాలాసార్లు సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల, వంట ఎలా చేయాలో అవగాహన లేకపోవటం వల్ల ఆలస్యం అవుతుంది. చాలా మంది మూకుడు స్టవ్‌ మీద పెట్టి, ఆ తర్వాత ఉల్లిపాయలు తరగటం మొదలుపెడతారు. దీని వల్ల సమయం కలిసివస్తుందనుకుంటారు. ఉల్లిపాయలను ముందుగా తరిగి పెట్టుకుంటే కలిగే సౌలభ్యాన్ని గ్రహించారు. ఇది ప్రణాళిక లేకపోవటానికి ఒక ఉదాహరణ. ఇదే విధంగా వంటలో ఏ వస్తువు ముందు వేయాలో చాలా మందికి తెలియదు. పసుపునే ఉదాహరణగా తీసుకుందాం. సాధారణంగా పసుపుకు పచ్చి వాసన ఉంటుంది. ఇది పోవాలంటే ముందే వేయాలి. చివరిలో పసుపును చల్లితే పచ్చి వాసన ఉండిపోతుంది. అంతే కాదు. అన్ని రకాల వంటల్లోను వాడే మసాలా పొడులు పది, పన్నెండు రకాలుంటాయి. సాస్‌లు పది పన్నెండు రకాలుంటాయి. అంటే ఇవి చేయటం తెలిస్తే ఎలాంటి వంటైనా సునాయాసంగా పూర్తి చేసేయవచ్చు.


వేడిగా ఉంటే చాలు..
ఫ నా దృష్టిలో కష్టమైన వంటలేమి లేవు. వంట చేసే ముందు ఏ వస్తువు ముందు వేయాలనే విషయాన్ని ఆలోచిస్తే చాలు. మా ఇంట్లో అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటా. మా ఆవిడ విదేశీ వంటకాలు నాచేత చేయించుకుని తింటూ ఉంటుంది. నేను మాత్రం వేడిగా ఉన్నదేదైనా తినేస్తా.
ఫ వంట మెడిటేషన్‌లాంటిది. వంట చేసే సమయంలో వచ్చే వాసనలను ఆస్వాదించటం నేర్చుకుంటే చాలు.. ప్రత్యేకంగా యోగా చేయాల్సిన అవసరం ఉండదు. దురదృష్టవశాత్తు ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు.
ఫ ఎటువంటి సామాన్లు అందుబాటులో లేకుండా వంట చేయగలిగిన వారే నిజమైన హీరో. అలాంటి వారి నుంచి నేర్చుకోగలిగిన విషయాలనేకం ఉంటాయి. ఒక సారి నేను సగం పగిలిన కుండలో గడ్డిని పెట్టి ఒక గుడ్డలో ఇడ్లీలను ఉడికిస్తున్న అమ్మాయిని చూశాను. నా దృష్టిలో అదే నిజమైన ఇన్నోవేషన్‌.
ఫ వంట చేసే ముందు దినుసులు, కూరల తత్వాన్ని తెలుసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటే రుచికరమైన వంటలు సునాయాసంగా చేసేయొచ్చు. ఉదాహరణకు బ్రెడ్‌ ఊతప్పంనే తీసుకుందాం. పిండిలో బ్రెడ్‌ను వేసి రుబ్బేస్తే జిగురుగా అయిపోతుంది. బ్రెడ్‌ను విడిగా పొడి చేసి, దానిని పిండిలో కలిపితే బావుంటుంది. చిన్న టెక్నిక్‌ అయిన దీన్ని ఆచరిస్తే రుచికరమైన వంట చేయగలుగుతాం. నాకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం. అర్థరాత్రయినా చేసుకుని తింటాను.
ఫ నేను చెఫ్‌గా ఉన్నప్పుడు- కొందరు రెస్టారెంట్‌కు వచ్చి- ‘‘ఈ డిష్‌ తింటుంటే 30 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన వంట గుర్తుకొచ్చింది’’ అనేవారు. నా జీవితంలో బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అవే.
http://www.andhrajyothy.com/Artical?SID=16444&SupID=25
ధ్యానం... వంట ఒకటే.! (11-Sep-2014)

No comments:

Post a Comment