ఒంట్లో రక్తం తగిందని చెప్పగానే రోజూ బీట్‌రూట్ తినమని సలహా
ఇచేస్తారందరూ.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధున్నవారు రెండు ముక్కలు తినడానికి
సిద్ధమవుతారు.కాని ఎక్కువమంది దాన్ని చూడగానే మూతి మూడు వంకర్లు
తిప్పుతారు.నిజానికి బీట్‌రూట్‌ను జ్యూస్,సలాడ్,వేపుడు రూపంలోనే కాకుండా
బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు.పూరీలు మొదలు వడలు వరకూ రకరకాల వంటలు
చేసుకోవచ్చు.
హల్వా:
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ దుంపలు - రెండు, పంచదార - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - అర కప్పు, కిస్‌మిస్‌లు - సరిపడా, జీడి పప్పులు -పది. తయారుచేయు విధానం: ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కిస్‌మిస్‌లు, జీడి పప్పు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నెయ్యి వేసి బీట్‌రూట్ తురుము వేసి వేగించాలి. పచ్చి మొత్తం పోయేవరకూ వేగాక అందులో యాలకుల పొడి, పంచదార వేసి మరికొద్దిసేపు వేగించి దించేయాలి. ఒక పళ్లెంలో నెయ్యి రాసి అందులో వేగించిన బీట్‌రూట్ ముద్దని వేసి చేతితో సమానంగా ఒత్తి పైన కిస్‌మిస్‌లు, జీడిపప్పులు గుచ్చాలి. చల్లారిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే బీట్‌రూట్ హల్వా తయారయినట్టే.
వడలు:
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ - ఒకటి, శెనగపప్పు - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - ఆరు, అల్లం తురుము - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర - రెండు కట్టలు, కరివేపాకు - ఒక రెబ్బ, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: శెనగపప్పుని ముందురోజు నానబెట్టుకోవాలి. తెల్లారాక పప్పుని శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగ రుబ్బుకోవాలి. ఇందులో అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర తురుము, బీట్‌రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి వడలుగా చేసుకుని నూనెలో వేగించుకోవాలి. రెండువైపులా వేగేలా చూసుకుని ఎరుపురంగు వచ్చాక తీసేయాలి.
పులావ్:
కావలిసిన పదార్థాలు: బీట్‌రూట్‌లు - రెండు, బాస్మతి బియ్యం - రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - ఐదు, ఎండు మిరపకాయలు - నాలుగు, కరివేపాకు - ఒక రెబ్బ, లవంగాలు - ఆరు, దాల్చిన చెక్కలు(చిన్నవి)- ఐదు, గరం మసాలా - ఒక టీ స్పూను, ఉల్లిపాయ - ఒకటి, పుదీన - నాలుగు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద దళసరి గిన్నె పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక లవంగాలు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీన ఆకులు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్‌రూట్ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి. ఆ తర్వాత బియ్యం, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి మరో ఐదు నిమిషాలపాటు వేగించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించి దించేయాలి.
పూరీలు:
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ దుంప - ఒకటి, గోధుమ పిండి -పావుకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధారం: ముందుగా బీట్‌రూట్‌ని శుభ్రంగా కడిగి తొక్కతీసి ముక్కలు కోసుకోవాలి. ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అరగ్లాసు నీళ్లు కలిపి చిక్కంతో వడకట్టుకోవాలి. గోధుమ పిండిలో తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె, సరిపడా బీట్‌రూట్‌నీళ్లు పోసి కలుపుకుని పూరీలు చేసుకుని నూనెలో కాల్చుకోవాలి. కెంపు రంగులో భలేగా ఉంటాయి పూరీలు.
పకోడా:
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ దుంపలు - రెండు, స్వీట్‌కార్న్ - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, శెనగపిండి - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - ఆరు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, వంట సోడా - చిటికెడు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: బీట్‌రూట్‌ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి. అందులో స్వీట్‌కార్న్, ఉల్లిపాయ ముక్కలు, శెనగపిండి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఈ పిండితో పకోడీలు వేసుకోవాలి.
No comments:
Post a Comment