పద్మాసన స్థితిలో కూర్చోవాలి. తర్వాత ఫొటోలో ఉన్నట్లు మోచేతుల సహాయంతో శరీరాన్ని మెల్లగా నేల మీదకు తీసుకురావాలి. ఈ స్థితిలో దేహం బరువు నడుము, మోచేతుల మీద ఉంటుంది. మెల్లగా వెన్ను, భుజాలు, తలను కూడా నేల మీదకు ఆనించి పడుకోవాలి.
మత్స్యాసనం గాలీ వెలుతురు ధారాళంగా ఉన్న ఇంట్లో చెమ్మ చేరదు.
ఊపిరి సాఫీగా ఉన్న ఒంటికి రోగమూ రొప్పూ ఉండదు.
పండగొస్తోంది.
గూళ్లు గుమ్మాలు ఎలాగూ దులుపుకుంటాం.
అలాగే శ్వాసకోశాలనూ కాస్త శుభ్రం చేసుకుంటే...
పండగ సంతోషాలకు ఆస్త్మాలు,ఆయాసాలు అడ్డురావు.
మత్స్యాసనం శ్రద్ధగా సాధన చెయ్యండి. లంగ్స్‌ని క్లీన్ చేసుకోండి.
మత్స్యాసనం వెయ్యడమంటే...
జీవకణాలకు ప్రాణవాయువును పంప్ చెయ్యడమే!!
ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...
అరచేతులను చెవులకు పక్కన నేలకు ఆనించాలి (ఈ స్థితిలో చేతి వేళ్లు భుజాలవైపు ఉండాలి). తర్వాత అరచేతుల మీద బలాన్ని మోపి నేలను నొక్కిపట్టి నడుమును, ఛాతీని పైకి లేపాలి. మెడను వెనక్కు వంచి తల నడినెత్తిని నేలకు ఆనించాలి.
ఇప్పుడు చేతులను తల పక్కనుంచి తీసి కాలివేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు ఆని ఉంటాయి. ఇది మత్స్యాసన స్థితి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అదెలాగంటే...
కాళ్లను వదిలి, అరచేతులను తలకు ఇరువైపుల నేలకు ఆనించాలి. తలను పైకి లేపి మెల్లగా భుజాలను నేలకు ఆనించిన తర్వాత తలను నేలకు ఆనించాలి. తర్వాత నడుము భాగాన్ని నేలకు ఆనించి, మోచేతుల సహాయంతో పైకి లేచి కూర్చోవాలి.
పద్మాసనాన్ని విప్పి శరీరాన్ని వదులు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 3-5 సార్లు చేయాలి. పద్మాసనం వేయలేని వాళ్లు లేదా పద్మాసన స్థితిలో ఎక్కువ సేపు ఉండలేని వాళ్లు... మత్స్యాసనాన్ని అర్ధపద్మాసనం వేసి వేయవచ్చు. అదీ సాధ్యం కానప్పుడు కాళ్లు చాపి కూడా చేయవచ్చు. కింద చెప్పిన అన్ని ప్రయోజనాలు చేకూరాలంటే పద్మాసన స్థితిలోనే వేయాలి.
మత్స్యాసనం ప్రయోజనాలు!
థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.
ఊపిరితిత్తులలోకి ప్రాణశక్తి బాగా అంది రక్తం శుద్ధి అవుతుంది.
ఉబ్బసం, ఆయాసం, శ్వాసనాళ సమస్యలు తగ్గుతాయి.
ఛాతీకండరాలు, మర్మాంగాలు శక్తిమంతం అవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం పోతుంది.
నడుము శక్తిమంతం అవుతుంది, గర్భకోశ సమస్యలు తగ్గుతాయి.
టాన్సిల్స్, మధుమేహం, మెదడు సమస్యల నుంచి ఉపశమనం.
నరాల సమస్యలు, చెవి, ముక్కు వ్యాధులు తగ్గుతాయి.
మత్స్యాసనాన్ని వీళ్లు చేయకూడదు!
సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.
హెర్నియా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
ఆస్త్మా నివారణకు ఉపకరించే మరికొన్ని యోగాసనాలు ఇవి!
ఉష్ట్రాసనం, శశాంకాసనం, శలభాసనం, సుప్తవజ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, కోణాసనం, పశ్చిమోత్తాసనం, సూర్యనమస్కారాలు, పవనముక్తాసనం, జలనేతి, సూత్రనేతి, కపాలభాతి, ఉజ్జయి, కుంజరధౌతి, విభాగ ప్రాణాయామం... మొదలైనవి. వీటిలో అనేక యోగాసనాలు గత సంచికలలో ప్రచురితమయ్యాయి.
మోడల్: మానస
- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఆయుర్వేదంలో..!
ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.
ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం... ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.
ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.
అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్... ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు
No comments:
Post a Comment