16 Jul 2015

హైబీపీ విస్మరిస్తే ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి జాగ్రత్త


మనం సరిగా పట్టించుకోవటం లేదుగానీ... అధిక రక్తపోటు..( హైబీపీ).. అతి పెద్ద ఆరోగ్య సమస్య! రక్తపోటును కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే.. మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం.. మెదడు నుంచి కాళ్ల వరకూ.. ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలాభాగం ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. అయినా చాలామందికి అసలు హైబీపీ ఉన్న విషయమే తెలియకపోవటం.. లోలోపల అది కీలక అవయవాలను కబళించేస్తుండటం.. ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న పెను సమస్య. హైబీపీ ఉన్నట్టు తెలిసినవాళ్లు కూడా.. 'ఆ.. ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్‌ బీపీ ఉంది..' అనుకుంటూ బీపీని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ బీపీ... ఉండాల్సిన దానికంటే కాస్త పెరిగినా ముప్పు ముప్పే. పైగా అగ్నికి ఆజ్యంలా దీనికి మధుమేహం, హైకొలెస్ట్రాల్‌ వంటివి తోడైతే ఇక జరిగే నష్టం అపారం!

నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు (హైబీపీ). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి హైబీపీ ఉందని.. 2025 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు మంది (150 కోట్లు) దీని బారినపడొచ్చని అంచనా వేస్తున్నారంటే ఇదెంత పెద్ద సమస్యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి దీన్ని 'సైలంట్‌ కిల్లర్‌'.. అంటే 'కానరాని ముప్పు' అనుకోవచ్చు. ఎందుకంటే హైబీపీ వచ్చినా చాలాకాలం పాటు పైకేమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్లు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది.. నీరసంగా ఉంటుందని రకరకాలుగా భావిస్తుంటారుగానీ అవన్నీ వట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్లు తిరగటం వంటి కొన్ని లక్షణాలు కనబడొచ్చుగానీ.. బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం 'సైలెంట్‌'గా జరిగిపోతుంటుంది. పైగా- హైబీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీన్ని నిర్లక్ష్యం చేసేకొద్దీ క్రమేపీ అది గుండె పోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు.


హైబీపీని దీర్ఘకాలం గుర్తించకపోవటం, నిర్లక్ష్యం చేయటం వల్ల తలెత్తే సమస్యలన్నీ తీవ్రమైనవే.

* మన దేశంలో నానాటికీ మూత్రపిండాల సమస్యలు పెరిగిపోతుండటానికి మధుమేహం, హైబీపీలే ప్రధాన కారణాలు.
* పక్షవాతం కేసుల్లో సుమారు 50%, గుండెపోటు, రక్తనాళాల సమస్యల్లో సుమారు 50 శాతం హైబీపీ వల్ల సంభవిస్తున్నవే.
* ఇవే కాదు.. హైబీపీ కారణంగా గుండె నుంచి బృహద్ధమని ఉబ్బిపోవటం, అది చిట్లిపోవటం వంటి అత్యవసర, ప్రాణాంతక సమస్యలూ పొంచి ఉంటాయి.


వీటన్నింటికీ హైబీపీనే మూలం. అయితే ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చేవి కావు. హైబీపీ కొన్నేళ్లపాటు నియంత్రణలో లేకపోతే క్రమేపీ కొన్ని సంవత్సరాల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇన్ని రకాల ముప్పులు పొంచి ఉంటున్నా దీని గురించి సమాజంలో అవగాహన తక్కువగా ఉండటం పెను సమస్యగా పరిణమిస్తోంది.

హైబీపీ, మధుమేహం రెండూ తోడుదొంగల్లాంటివి. మధుమేహుల్లో దాదాపు నాలుగింట మూడొంతుల మందికి హైబీపీ ఉంటుంటే.. హైబీపీ ఉన్నవారిలో నాలుగో వంతు మందికి మధుమేహం ఉంటోంది. ఈ రెండూ ఉన్నవారికి దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది.

జీవనశైలి మార్పులు: అందరికీ తప్పవు
* ఉప్పు: ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం కచ్చితంగా బీపీని పెంచుతుంది. ఉప్పు తక్కువ తినే సమాజాల్లో హైబీపీ సమస్య తక్కువగా ఉండటమే దీనికి తార్కాణం. ఆహారంలో ఉప్పు తగ్గించటం చాలా అవసరం. సామాజికంగా కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఊరగాయ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, రడీమేడ్‌ ఆహారపదార్థాలు.. ఇలా అన్నింటా ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. ఉప్పు తగ్గించగలిగితే బీపీ దానంతట అదే కొంతకాలానికి, కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.

* పండ్లు: ఆహారంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. పండ్లలో పొటాషియం బీపీ తగ్గేందుకు బాగా దోహదం చేస్తుంది.

* బరువు: అధిక బరువు ఉంటే కచ్చితగా బీపీ పెరుగుతుంది. కాబట్టి తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు కొంత తగ్గించినా దానికారణంగా బీపీ కొంతైనా తగ్గుతుంది.

* వ్యాయామం: రోజూ లేదా కనీసం వారానికి నాలుగైదు సార్లు వేగంగా నడవటం వల్ల కొంతైనా దానంతట అదే బీపీ తగ్గుతుంది. వ్యాయామం తప్పనిసరి అని అందరూ గమనించాలి.

* పొగ: పొగ కచ్చితంగా బీపీ పెంచుతుంది. అంతేకాదు, అనేక విధాలుగా కూడా అనర్థదాయకం. కాబట్టి పొగ పూర్తిగా మానెయ్యాలి.

* మద్యం: ఆల్కహాలు చాలా మితంగా విస్కీ, బ్రాండీ 1.5 ఔన్సులు (50-60 మిల్లీలీటర్లు మించకుండా) తీసుకోగలిగితే మంచిదేగానీ ఆ నియంత్రణలో ఉండలేనివారు దాని జోలికే పోకూడదు. అధికంగా మద్యం తీసుకోవటం హైబీపీకి ఒక ముఖ్యకారణం.

* మందులు: నొప్పినివారిణి మందులు, గర్భనిరోధక మాత్రలు, ముక్కు రంధ్రాలు బిగిసినప్పుడు తగ్గేందుకు వేసుకునే చుక్కల మందులు, స్టిరాయిడ్స్‌.. వీటన్నింటి వల్లా బీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు, పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అలాగే బీపీ చికిత్సకు వెళ్లినప్పుడు వాడుతున్న ఇతర మందుల వివరాలన్నీ వైద్యులకు చెప్పాలి.

ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సినవి. వీటిని జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులుగా చెబుతున్నప్పటికీ అందరూ అసలు వీటినే జీవన శైలిగాఅలవరచుకోవటం ఉత్తమం.

ముందస్తు ముప్పు
మధుమేహుల్లో పూర్తిస్థాయి మధుమేహం రావటానికి ముందస్తు దశ (ప్రీడయాబెటీస్‌) ఉన్నట్టుగానే హైబీపీ బాధితుల్లోనూ 'ప్రీహైపర్‌టెన్షన్‌'.. అంటే 'అధిక రక్తపోటు రావటానికి ముందు దశ' ఉంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దరిదాపు సగం మంది ఈ 'ప్రీహైపర్‌టెన్షన్‌' దశలోనే వీటి బారినపడుతున్నారు. కాబట్టి హైబీపీ వచ్చిన తర్వాతే కాదు.. దానికి కాస్త ముందు దశలో ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

నార్మల్‌ కంటే తక్కువున్నా ముప్పు
* రక్తపోటు 140/90 కన్నా ఎక్కువ ఉన్నవారికి చికిత్స చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి దాన్ని 'హైపర్‌టెన్షన్‌' ప్రమాణంగా తీసుకున్నారు. కానీ వాస్తవానికి రక్తపోటు 115/75 నుంచి పైకి పెరుగుతున్న కొద్దీ దీర్ఘకాలంలో ముప్పు కూడా పెరుగుతున్నట్టు గుర్తించటం విశేషం. ముఖ్యంగా బీపీ 115/75 నుంచి క్రమేపీ 15/5 చొప్పున పెరుగుతున్న కొద్దీ.. 20-30 ఏళ్లలో వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి వచ్చే ముప్పు రెట్టింపు అవుతున్నట్టు స్పష్టంగానే గుర్తించారు. కాబట్టి రక్తపోటు 120/80 ఉంటే నార్మల్‌గా ఉన్నట్టే చెప్పుకొంటాంగానీ వాస్తవానికి అంతకన్నా తక్కువగా.. 115/75 దగ్గరే ఉండేలా చూసుకోవటం ఉత్తమం. కాకపోతే దీన్ని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతోనే సాధించాలి. అంటే బీపీ నార్మల్‌గా ఉన్నాసరే జీవనశైలి మార్పులు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇక నార్మల్‌ దాటుతున్న కొద్దీ జీవనశైలి మార్పులను కచ్చితంగా, తప్పనిసరిగా పాటించాలి.

* ప్రీహైపర్‌టెన్షన్‌ గలవారు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోతే.. కొన్నేళ్ల తర్వాత తప్పకుండా హైబీపీలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.

గుర్తించటం ముఖ్యం
మధ్యవయసు వాళ్లు ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు తప్పకుండా బీపీ పరీక్షించాలి. ఇలా చెయ్యకపోవటం వల్లనే చాలామందికి తెలియకుండా ఉండిపోతోంది, దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు ముంచుకొచ్చేస్తున్నాయి.

* ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఓ ఐదు నిమిషాలు కూచున్న తర్వాత ఒకసారి బీపీ చూడాలి. 5-10 నిమిషాల తేడాతో మరోసారి చూడాలి. నాలుగైదు రోజుల విరామం తర్వాత మరోసారి కూడా.. ఇలాగే మరో రెండు దఫాలు చూడాలి. ఈ నాలుగుసార్లలో సగటున బీపీ 140/90 కంటే ఎక్కువుంటే దాన్ని హైబీపీగా గుర్తించాలి.

* బీపీ ఉదయం లేవంగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవటం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో పరీక్షించుకోవటం ఉత్తమం.
* మధుమేహుల్లో, 60 ఏళ్ల పైబడిన వయసు వారిలో బీపీ అప్పుడప్పుడు నిలబడినప్పుడు కూడా చూడటం మంచిది.

మందులు: ఎవరికి అవసరం?
* ఎవరికైనా 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి.

* కొందరికి మాత్రం 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే.. అంటే 'ప్రీహైపర్‌టెన్షన్‌' దశలోనే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఎవరికంటే: మధుమేహం ఉన్నవారికి, ఇప్పటికే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు గలవారు అంటే.. మూత్రపిండాల్లో రక్తం శుద్ధి రేటు (గ్లోమరూలో ఫిల్టరేషన్‌ రేట్‌) నిమిషానికి 60 కన్నా తగ్గినవారికి.. రక్తపోటు ప్రీహైపర్‌టెన్షన్‌ దశలోనే మందులతో చికిత్స అవసరం. వీరు కేవలం జీవనశైలి మార్పుల మీదే ఆధారపడితే ఉపయోగం ఉండదు.

* 55-60 ఏళ్లు పైబడిన వారిలో పై అంకె (సిస్టాలిక్‌) పెరిగే అవకాశం ఉంది. దీన్నే 'ఐసోలేటెడ్‌ సిస్టాలిక్‌ హైపర్‌టెన్షన్‌' అంటారు. వీరిలో బృహద్ధమనిలో సాగే గుణం తగ్గి, గుండె నుంచి ఉబికివచ్చే రక్త పరిమాణానికి తగ్గట్టు అది సాగలేకపోతుంటుంది. దీంతో పైఅంకె పెరుగుతుంది. అలాగే వీరిలో కింది అంకె క్రమేపీ తగ్గే అవకాశమూ ఉంటుంది. ఇదీ వ్యాధిలో భాగమేనని గుర్తించాలి. వీరికి వైద్యం అవసరం.

* స్థూలంగా.. ఇతరత్రా దుష్ప్రభావాలేమీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నవారికి అది 140/90 మించితేనేగానీ మందులతో చికిత్స అవసరం ఉండదు. వీరు జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. కానీ మధుమేహం, కిడ్నీ జబ్బులు, గుండెపోటు ముప్పులున్న వారిలో 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు వాడి నియంత్రణలోకి తేవటం ముఖ్యం.

మందులేవైనా బీపీ తగ్గించటం ముఖ్యం!
హైబీపీ నియంత్రణ కోసం చాలా రకాల మందులున్నాయి. ఏ మందు వాడినా బీపీ నియంత్రణలోకి తేవటం ముఖ్యం. ప్రధానంగా ప్రయోజనం చేకూరేది బీపీ తగ్గించినందు వల్లనే! కాకపోతే కొన్నికొన్ని సందర్భాల్లో కొన్ని మందులు ప్రత్యేకంగా వాడితే అదనపు లాభాలుంటాయి. ఉదాహరణకు గుండెకు సంబంధించిన ముప్పులున్న హైబీపీ బాధితులకు 'బీటాబ్లాకర్స్‌', మధుమేహం ఉన్న హైబీపీ బాధితులకు 'ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌' 'ఏఆర్‌బీ'లు, 55-60 పైబడిన సిస్టాలిక్‌ బాధితులకు 'క్యాల్షియం ఛానల్‌ బ్లాకర్స్‌', ప్రోస్టేట్‌ సమస్యలున్న వారికి 'ఆల్ఫా బ్లాకర్స్‌'.. ఇలా వ్యక్తిని బట్టి మందును ఎంపిక చేస్తారు. ఒక మందుతో తగ్గకపోతే దాన్నే మరీ డోసు పెంచేకంటే మరో రకం మందును జోడించటమన్నది ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం.

* వీటిలో కొన్ని మందులను మొదలుపెట్టే ముందు వైద్యుల పర్యవేక్షణ అవసరం. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా ఒక్కసారే తగ్గించెయ్యటం కాకుండా.. క్రమేపీ తగ్గుకుంటూ వచ్చేలా చూడటం ముఖ్యం.

* సాధారణంగా ఉదయం లేవగానే బీపీ ఒక్కసారిగా పెరుగుతుంది. కాబట్టి బీపీ కోసం దీర్ఘకాలం మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన మేరకు నిద్ర లేవటానికి ముందు ఏ నాలుగైదు గంటలకో మెలకువ వస్తే అప్పుడు మందు వేసుకున్నా మంచిదే. దీంతో ఉదయం పూట బీపీ హఠాత్తుగా పెరగకుండా చూసుకునే వీలుంటుంది.

హైబీపీతో అధిక ముప్పు ఎవరెవరికి?--ప్రమాద సూచికలు:
1. బీపీ బాగా ఎక్కువగా ఉండటం.
2. బీపీ రెండు అంకెల మధ్యా వ్యత్యాసం అధికంగా ఉండటం (60 పైబడిన వారిలో).
3. పెద్దవయసు: మగవారిలో 55పైన, స్త్రీలలో 65 పైన ఉండటం.
4. పొగ తాగే అలవాటుండటం.
5. కొలెస్ట్రాల్‌: ఎల్‌డీఎల్‌ 115 కంటే ఎక్కువగా ఉండటం.
6. మధుమేహంగానీ, మధుమేహం ముందుదశగానీ ఉండటం.
7. కుటుంబంలో చిన్నవయసులో గుండెజబ్బుల చరిత్ర ఉండటం.
8. వూబకాయం: పొట్టదగ్గర కొవ్వు పేరుకోవటం.

అవయవాలు దెబ్బతింటున్నాయని చెప్పే సంకేతాలు
1. గుండెలో ఎడమ జఠరిక మందం కావటం (ఈసీజీ, ఎకో పరీక్షల్లో తెలుస్తుంది)
2. మెడలోని మెదడు రక్తనాళాలు మందం కావటం (డాప్లర్‌ పరీక్షలో గుర్తించొచ్చు)
3. కిడ్నీల వడపోత సామర్ధ్యం (జీఎఫ్‌ఆర్‌) 60 కంటే తక్కువ కావటం, మూత్రంలో స్వల్పంగా ఆల్బుమిన్‌ పోతుండటం.

అవయవాలు ఇప్పటికే దెబ్బతిన్న సూచనలు
1. పక్షవాతం వచ్చి ఉండటం (మెదడు)
2. గుండెపోటు, గుండె బలహీనం కావటం(గుండె, రక్తనాళాలు)
3. మూత్రపిండాల వ్యాధులు
4. కాళ్లలోని రక్తనాళాల్లో పూడికలు రావటం
5. కంటిలోని రక్తనాళాల్లో మార్పులు (రెటీనోపతి)

పైవాటిలో ఏది కనిపించినా హైబీపీ వల్ల ఆ వ్యక్తికి అత్యంత ప్రమాదం ఉందని గుర్తించాలి. వీటిలో ఎన్ని ఎక్కువ ముప్పులు ఉంటే ప్రమాద తీవ్రత అంతగా పెరుగుతుంది.వీటన్నింటినీ చూసి అప్పుడు హైబీపీని ఉద్ధృత చికిత్సతో తగ్గించాలా? కాస్త నెమ్మదిగా తగ్గించాలా? దానివల్ల ప్రమాదం ఎంత ఉందన్నది నిర్ధారిస్తారు.

బీపీ ఎంత వరకూ తగ్గించాలి?
ప్రస్తుత సూచనల ప్రకారం: ఇతరత్రా ముప్పులు లేని వారికి 140/90కి గానీ, అంతకంటే కొద్దిగా తక్కువకుగానీ తేవాలి. డయాస్టాలిక్‌ 80, 85కు తేగలిగితే మరీ మంచిది. అంతకంటే బీపీని మందులతో నియంత్రించటం వల్ల ప్రయోజనం ఉంటుందని ఇదమిత్థంగా తేలలేదు.

* 55-60 పైబడిన వారిలో సిస్టాలిక్‌ రక్తపోటు సుమారు 150 వరకూ తీసుకురాగలిగితే సరిపోతుంది. వీరిలో కింది అంకె 60, 65 కంటే తక్కువుంటే మందుల వాడకంలో కొంత జాగ్రత్త వహించాలి.

* మధుమేహం, కిడ్నీజబ్బులు, గతంలో గుండెపోటు వ్యాధుల బారిన పడినవారికి మాత్రం బీపీ 120/80కి గానీ, అంతకంటే తక్కువకుగానీ తేవాలి.

* మందులతో బీపీ మరీ తగ్గుతుంటే మందుల డోసు తగ్గించే అవకాశం ఉంటుంది.

* బీపీతో పాటు ఉదాహరణకు మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి ఇతరత్రా ముప్పులుంటే వాటిని కూడా కచ్చితంగా నియంత్రించుకోవటం తప్పనిసరి. మధుమేహంగానీ, హైబీపీగానీ ఉన్నప్పుడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ పరిమితిని సాధారణ ఆరోగ్యవంతుల్లో కంటే కూడా తక్కువగా ఉంచాలి.

Dr. D.N.Kumar -Senior Cardiologist , Medical director , Care hospital , Nampally ,Hyderabad.


No comments:

Post a Comment