15 Jul 2015

ఆరోగ్య సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే దాకా విరామం లేకుండా పనిచేయడం వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* పనిలో పడి నీళ్లు తాగడం కూడా మర్చిపోతున్నారా? దానివల్ల తలనొప్పులూ, అలసటా, శరీరంలో శక్తిలేకపోవడం లాంటి సమస్యలు తప్పవు. అందుకే కాస్త దాహంగా అనిపించినా పనులన్నీ పక్కనపెట్టి మంచి నీళ్లు తాగండి.

* రోజంతా చురుగ్గా పని చేయాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదు. అందుకే రోజూ కాసేపు వ్యాయామం చేసేలా చూసుకోండి. కాసేపు నడవండి. ఇంటిపనుల్లో భాగంగానే మెట్లెక్కి దిగండి.

* ఎంత హడావిడిగా ఉన్నా, రోజూ పొద్దున్నే టిఫిన్‌ని మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఓ చక్కని పరిష్కారం. అలాగే వేళకు భోంచేయడమూ పాటించాల్సిన జాగ్రత్తే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

నమిలి తింటున్నారా?
   * జీవనశైలి మారిపోయింది. చాలామందికి కనీసం తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. కంగారులో ఏదో నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకోవడమే కానీ నమిలి తినడం గురించి శ్రద్ధ పెట్టట్లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

* హడావుడిగా తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు. మరో వైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. కొద్ది సేపటికే ఆకలి వేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది. అప్పుడు ఎంత తినాలో అంతే తింటాం. ఆకలి కూడా త్వరగా వేయదు. అంతేకాదు... లాలాజల గ్రంథులు కూడా చురుగ్గా మారతాయి.

* బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా అయి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది.

* ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వల్ల కడుపులో గ్యాస్‌, ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటాయి. మరి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయాలంటే బాగా నమలాలి. నములుతున్నప్పుడు నోట్లో లాలాజలం స్రవిస్తుంది. ఇందులో మేలు చేసే బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడతాయి.

* బాగా నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుంది. తక్కువ ఆహారమైనా సరే నమిలి తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలిగా అనిపించదు. మాటిమాటికీ తినాలనే కోరిక కూడా కలగదు. దాంతో లావయ్యే సమస్య ఉండదు.

* నమలడం వల్ల దంతాల మధ్యలో ఆహార పదార్థాలకు సంబంధించి ఏమీ ఇరుక్కోకుండా ఉంటాయి. దంతాలు కూడా గట్టి పడతాయి. ముఖ కండరాల దగ్గర కొవ్వు కూడా చేరుకోకుండా ఉంటుంది.

courtesy with : Eenadu vasundara news paper 02-08-2014

No comments:

Post a Comment