17 Jul 2015

పుష్కర స్నాన విధానము:




ఏ తీర్థ స్నానానికైనా మొదట సంకల్పము చెప్పుకొని స్నానం చేయాలి. లేక పొతే తగినంత ఫలం ఉండదు.
నదీ స్నానం చేసే ముందే ఇంటిలో ఒకసారి స్నానం చేయాలి. వేరే ఊరి నుండి వచ్చేవారు యాత్రకు వస్తే ఒకరోజు ఉపవాసం చేసి ఆ తరువాత రోజు పితృ శ్రాద్ధ కర్మలు చేయాలి. పుష్కరస్నానం చేసే ముందు తీరంలోని మట్టిని తీసుకొని నదిలోని నీళ్ళలోకి వేయాలి.

పుష్కర సమయం లో ముఖ్యంగా మూడు పనులను చేయాలని పెద్దలు సూచించారు. అవి:

1. స్నానము
2. దానము
3. శ్రాద్ధము

ఇలా చేయకపోతే స్నానం చేసేవారి పుణ్యాన్ని “కృత్య” అనే శక్తి హరిస్తుంది (తినేస్తుంది).
“కృత్య”: శివుని మూడో కంటి మంటలోనుండి ఉద్భవించిన శక్తి .
తరువాత నదిలోకి ప్రవేశించి ఈ క్రింది శ్లోకం చదవాలి:

“పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి
మృత్తికాంతే మయాదత్తా మహారార్ధం ప్రకల్పయ.”

ఈ మంత్రము చదువుకొని మట్టిని నదిలోకి వేసి మూడు సార్లు బ్రొటనవేలితో నీళ్ళు తీసుకొని తలపై చల్లుకోవాలి.
(గోవిందా అని మూడు సార్లు దేవుణ్ణి తల్చుకొని చల్లుకోవాలి). తరువాత గోదావరికి నమస్కరించి, ఆచమనం చేసి, (ఆచమనం అంటే –కుడిచేతిలోకి నీళ్ళు తీసుకొని దేవుడి పేరు చెప్పి త్రాగాలి). తదుపరి ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి.
సంకల్పం :
************
“అస్యాం మహానద్యాం సమస్త పాప క్షయార్ధం
సింహగతే దేవగురౌ సార్ధత్రికోటి
తీర్ధసహిత తీర్ధరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే
అఖండ గౌతమీ స్నాన మహం కరిష్యే .”
అని చెప్పి మూడు సార్లు నీటిలో మునక వేసి స్నానం చేయాలి.
పై మంత్రము చెప్పలేనివారు ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు: “అమ్మా గోదావరి ఈ పవిత్ర నదిలో స్నానం చేస్తున్నాను అని తమ పేరు, గోత్రం, దేశం, కాలం” చెప్పుకొని స్నానం చేయాలి. తరువాత గురుడికి, పుష్కరుడికి, సూర్యుడికి ముక్కోటి దేవతలకు, సప్త ఋషులకు, గోదావరి నదికి అర్ఘ్యం ఇవ్వాలి (అర్ఘ్యం అనగా రెండు దోసిళ్ళలోకి నీళ్ళు తీసుకొని తూర్పు దిశగా నిలబడి పైన చెప్పినవారందరకు ఆ నీటిని చూపించి నదిలో విడిచిపెట్టాలి). తరువాత పితృ దేవతలను స్మరించి వారికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. తిరిగి మళ్ళీ నదిలో మూడు సార్లు మునక వేసి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసి పవిత్రమయిన తరువాత
“ఆచరిత వ్రత కల్పోక్త సకల ఫలావ్యాప్తర్ధం గౌతమీ పూజాం కరిష్యే“ అని సంకల్పం చెప్పి షోడశోపచారాలతో గోదావరీ మాతకు పూజలు చేయాలి .
స్నానం చేస్తున్నప్పుడు పరిపూర్ణ ఫలితాన్ని పొందటానికి శంకరాచార్యుల వారు “పుష్కరాష్టకం “లో చెప్పిన మరొక శ్లోకం కూడా చదువుకోవటం ఉత్తమోత్తమం .
“శ్రీ యాయుతం త్రిదేహ తాప పాప రాశి నాశకం
మునీంద్ర సిద్ధ సాధ్య దేవదాన వైరభిష్టుతం
తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం
నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం “ .
పై శ్లోకాన్ని చద వటం వలన పుష్కరుని యొక్క సర్వ దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి .
పుష్కర స్నాన నియమాలు :
1. ఇంట్లో స్నానం చేయకుండా, నేరుగా నదిలో చేసే వారు నదికి తూర్పు ముఖంగా నిలబడి స్నానం చేయాలి.
2. అభ్యంగస్నానం (తలంటు), తలకు నూనె రాసుకోవటం వంటివి చేయకూడదు.
3. సబ్బులు, షాంపూలు వాడరాదు.
4. కేవలం ఒళ్ళు తడిసే వరకు మూడు మునకలు వేయాలి.
5. నిద్రపోయి వచ్చిన బట్టలతో స్నానం చేయకూడదు.
6. ఒకే వస్త్రంతో స్నానం చేస్తే ఐశ్వర్యం పోతుంది. అందుకే పంచె మీద ఉత్తరీయం (చిన్న టవల్ ) చుట్టుకొని స్నానం చేస్తే మంచిది .
7. తెల్లటి వస్త్రంతో స్నానం చేయాలి (ఎరుపు రంగు వాడరాదు).
8. స్నానం చేశాక తడి వస్త్రాన్ని క్రింద పడవేయకూడదు.
9. నది మధ్యలోకి, లోతుగా ఉన్న చోటుకు వెళ్లి స్నానం చేయవద్దు.
10. స్నానం చేసిన వస్త్రాలను నదిలో పిండకూడదు.
11. నదిలో ప్లాస్టిక్ కవర్లను వేస్తే మహాపాపం. నదిలో కాని తీరంలో కాని ఉమ్మివేసినచో వికలాంగులవుతారని పోతన గారు చెప్పారు. కావున తగు జాగ్రత్త తీసుకోగలరు.
12. స్వచ్చమైన నీటిని మాత్రమే త్రాగండి.
13. మాసిన, చిరిగిన బట్టలతో స్నానం చేయకూడదు.
14. అర్ధరాత్రి 12 గం. లకు స్నానం చేయకూడదు.
15. అల్పాహారం, భోజనం వంటివి చేసి స్నానం చేయకూడదు (కానీ వృద్దులు, పిల్లలు, వ్యాధి గ్రస్తులు అల్పాహారం తిని పుష్కర స్నానం చేయవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి).
పుష్కర స్నానం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి. “బ్రహ్మపురాణం “ ప్రకారం దైవనది అయిన గోదావరిలో స్నానం చేస్తే , సమస్త పాపాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాక ఇందులో స్నానం చేసిన వారికి దీర్ఘాయువు లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి .
ఈ సమయంలో దేవతర్పణాలు, ఋషి తర్పణాలు, పితృ తర్పణాలు వంటివి ఇస్తే వారి యొక్క ఋణవిముక్తులవుతారు.
https://www.facebook.com/PravachanaChakravarti

No comments:

Post a Comment