27 Jun 2015

ఉప్పు (Salt) గురించి కొంచం తెలుసుకొందాం


 భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్.

ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను,

చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు.
మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్‌ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.

ఉప్పు వివరాలు

ఉప్పు అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది, ఆతి సరసమైనది ఆహార పదార్థాలలో ఏదైన వున్నదంటే అది ఉప్పు. మాత్రమె. వంట ఎంత బాగా చేసినా అందు కొంచెం ఉప్పు చేర్చనిదే దాని రుచి రాదు. ఏ కూర లేకున్న అన్నంలో నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకుంటె ఆ పూట గడిపేసె బడుగు జీవులెందరో వున్నారు. షడ్రుచుల్లో ఒక దాని రుచిని నియంత్రించె శక్తి మరొక దానికి లేదు ఒక్క ఉప్పు కు తప్ప. అందుకే ఉప్పు ని రుచుల్లో రారాజు అన్నారు. ఇప్పుడు ఉప్పు విరివిగా దొరకడం వల్ల ఇది చాల చవక. కాని ఒకప్పుడు ఉప్పు ఎంతొ విలువైనది. ఉప్పు ని బంగారం లాగ చూసేవారు. రాజుల కాలంలో ఉప్పు ద్రవ్వంగా వాడ బడి నట్లు తెలుస్తున్నది. ఉప్పు రాజ్యాలని నిర్మించింది అలాగె రాజ్యాలను కూల్చి వేసింది కూడ. అంతటి ఘన చరిత్ర ని గురించి తెలుసుకోవడం ఎంతైనా ఆవసరం:
'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా".......అని ఉప్పు విలువను గొప్ప గా చెబితే, "వీడు ఉప్పు రాతికి కూడ కొరగాడు" అనే నానుడి ఉప్పు అతి చవక అనే విషయాన్ని తెలియ జేస్తుంది.


ఉప్పు ఎలా తయారు చేస్తారు?


భూగోళంపై మూడొంతులు నీరె అనే విషయం అందరికి తెలిసినదే. ఆనీరంతా ఉప్పు నీరె అనే సంగతి కూడ అందరికి తెలిసినదే. ఆ ఉప్పు నీటిని మడులలో సూర్య రస్మి తో ఇగర బెట్టి ఉప్పు తయారు చేస్తారు. కాని అన్ని ప్రాంతాలలోని సముద్రం నీరు తో అలా ఉప్పును తయారు చేయలేరు. ఆ నీటిలో ఉప్పు సాంద్రత తగినంత ఉండాలి. భూమిలో గనులనుండి కూడ ఉప్పును త్రవ్వి తీస్తారు. అలా తీసిన ఉప్పును రాతి ఉప్పు లేదా సైందవ లవణం అంటారు. ఆయుర్వేద వైద్యంలో దీని ఉపయోగం ఎక్కువ. కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీటిని పాత్రలలో పోసి మరగ బెట్టి ఇగర బెట్టి ఉప్పును తయారు చేస్తారు. సామాన్యంగా డిసెంబరు లో ఉప్పు మడులను తయారు చేస్తారు. మడులను చదునుగా తయారు చేసి గట్టి పరుస్తారు. బాగ ఆరబెట్టిన తరువాత ఉప్పునీటిని మడులలోకి యంత్రాలద్వార మల్లిస్తారు. ఎండకు ఆ మడుల లోని నీరు ఆవిరి అయి ఉప్పు స్పటికాలు గా ఎర్పడు తుంది. వాతావరణం అనుకూలంగా వుంటే సుమారు నలబై రోజులలో ఉప్పు తయారు అవుతుంది. తయారైన ఉప్పును పక్కనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో రాసులుగా పోసి పైన కప్పు వేస్తారు. తిరిగి మడులలో ఉప్పు నీటిని నింపుతారు. ఉప్పు మడి తయారు చేసిన తరువాత మొదటి పంట కన్నా రెండో పంట కొంత స్వచ్చంగా ఉంటుంది. మొదటి పంట లో మడిని తయారు చేసి నప్పుడు కొంత మలినాలుండి ఉప్పు కు రంగులో తేడా వుంటుంది.


ఉప్పు

అన్నది కేవలం వంటల్లో వేసుకునే చిటికెడంత పదార్థం అనుకుంటే అది పొరబాటే. వాడుకోడానికి చిటికెడంత అయినా మన సంస్కృతిలో దాని స్థానం బోలెడంత. మన జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఒకనాటి కరెన్సీకి ప్రతిరూపం. వేతనానికి పర్యాయపదం. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో... ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. పుట్టబోయే బిడ్డ మేధోవికాసం సరిగా జరగాలంటే అయొడైజ్‌డ్ ఉప్పు వాడాలి. మన దేహంలో మెదడు నుంచి అన్ని అవయవాలకు అందాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్ సరిగా జరగాలంటే ఉప్పు కావాలి. అయితే ఈరోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ, ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయన్న మాటే. అది విని చాలామందిలో ఒక ఆందోళన. ఉప్పు నిజంగానే అంత ప్రమాదకరమా, ఆరోగ్యానికి చేటు కలగకుండా వాడుకోవాలంటే ఎంత పరిమాణంలో వాడాలి. మితిమీరిన ఉప్పు నిజంగానే ప్రమాదకరం. అందులో సందేహం లేదు. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పును పూర్తిగా పరిహరించాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలూ ఉంటాయి. ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండటం వల్ల రక్తకేశనాళికలు (కేపిల్లరీస్) అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండటంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిణామం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని, ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తుంటారు. రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే!..

మోతాదుకు మించిన ఉప్పు ప్రమాదకారే. కానీ మోతాదుకు మించని ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పైగా మెదడు నుంచి వచ్చే ఆదేశాలను అన్ని అవయవాలకు అందించడంతో పాటు చాలా రకాల కీలకమైన జీవక్రియలకు ఉప్పు అవసరం. అందుకే దాన్ని మోతాదుకు మించనివ్వద్దు తప్ప... .పూర్తిగా ఆపేయకూడదు.

ఉప్పుతో ఉపయోగాలివి

 ఉప్పులోని లవణగుణంలో ఉండే అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కావాలి.

 కండరాల కదలికలకు (మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా) ఉప్పు ఉపయోగపడుతుంది. మన కాళ్లూ చేతులు ఉప్పు వల్లనే కదులుతుంటాయి. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు లవణాలు అందకపోవడం వల్ల కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోతుంటాయి. దాంతో కండరాలు, పిక్కలు బలంగా పట్టేస్తుంటాయి. ఇది ఎంత బాధాకరమైన పరిణామమో మనలో అనుభవించిన చాలామందికి తెలిసిన విషయమే. అందుకే క్రికెట్ మొదలుకొని చాలామంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. ఆడలేకపోవడం అటుంచి కాలు కదపడమే కష్టమైనంత బాధాకమైన పరిస్థితి వస్తుంది.

 వేసవిలో వడదెబ్బ తగిలిన వారు, నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో ద్రవాలు కోల్పోయిన వారు... ఒక్కోసారి మరణించే పరిస్థితికి చేరువవుతారంటే అది కేవలం శరీరంలో నీళ్లు తగ్గడం వల్లనే కాదు. ఆ నీరు తగ్గినందువల్ల ప్రతి అవయవానికి అవసరమైన ఉప్పు అందకపోవడం వల్లనే. అందుకే వేసవిలో డీ-హైడ్రేషన్‌కు గురైన వారికి కేవలం నీళ్లు తాగించడం మాత్రమే గాక అందులో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేస్తారు. పై కండిషన్‌లో కొందరు లవణాలు పుష్కలంగా ఉండే కొబ్బరినీళ్లని తాగిస్తారు. ఇక ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సలో భాగంగా రక్తనాళం నుంచి సెలైన్ ఎక్కించే ప్రక్రియలో ‘సెలైన్’లో ఉండే పోషకాల్లో నీరు, ఉప్పు అత్యంత ప్రధానమైనవి.  ఉప్పులోని సోడియం శరీరంలోని నీటిపాళ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.


 ఉప్పు కోసం  కిడ్నీ చేసే మేలెంతో గమనించారా

మరి ఉప్పుతో ఇన్ని ఉపయోగాలున్నప్పుడు కొందరు దాన్ని పూర్తిగా పరిహరిస్తారు. అది తీసుకుంటేనే ప్రమాదమంటూ దూరం పెడతారు. అలాంటివారికి ఎలాంటి ప్రమాదాలూ చోటుచేసుకోవడం లేదు కదా!’ అని కొందరిలో సందేహం ఉండవచ్చు. నిజానికి మన శరీరంలో ఉప్పు తగ్గినప్పుడు, ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా ఉప్పు బయటికి పోకుండా అడ్డుకుంటాయి. అలా అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద  నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలామందిలో ఉప్పు పాళ్లు తగ్గినా అప్పుడప్పుడూ పొరబాటునో, లేక వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన ఉప్పును జాగ్రత్త చేసి శరీరానికి అందిస్తూ ఆ కొరత తీరుస్తుంటాయన్నమాట. (కొన్ని పదార్థాలలో స్వాభావికంగానే ఉప్పు ఉంటుంది. అంటే మాంసంలో, కూరగాయల్లో, పాలకు సంబంధించిన పదార్థాలైన డెయిరీ ప్రాడక్ట్స్‌లో ఉప్పు ఉంటుంది. బ్రెడ్ పీసెస్ రెండింటిలో స్వాభావికంగానే 296 మి.గ్రా. ఉప్పు ఉంటుంది)

 అందుకే చాలామందిలో ఉప్పు అంతగా అందకపోయినా శరీరంలో ఉండే ఈ రక్షణ వ్యవస్థ వల్ల వారికి ప్రమాదం జరగదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు కొద్దిపాటి ఉప్పు తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి అది గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ సమస్యలకు, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు.

 ఎంత ఉప్పు వాడాలి?

 అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం: ఉప్పు చాలా పరిమితంగా వాడాలన్న విషయం నిర్వివాదాంశమే అయినా నిర్దిష్టంగా ఒకరికి ఎంత ఉప్పు అవసరమన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి తనకు బ్లడ్‌ప్రెషర్, డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి లేకపోయినా ప్రతిరోజూ 3.75 గ్రాములకు మించి వాడకూడదు. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల  జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియమ్ అందుతుందన్నమాట.  ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీపై అదనపు భారం పడకుండా ఉండటం కోసం ఉప్పువాడకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గరిష్టంగా 6 గ్రాములకు మించనివ్వకూడదు.

గుండెను కబలిస్తుంది

సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.


రక్తపోటును పెంచుతుంది


శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్‌ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్‌ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్‌ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్‌ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్‌ తీసుకుంటారు. ఈ పిల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్‌ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్‌ హెమరేజ్‌ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.


బిపికి జీవితాంతం మందులు

ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్‌ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్‌ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.


బహు ప్రయోజనకారి

ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్‌ ప్రెజర్‌ ' కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్‌ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్‌ చేస్తుంది. ఆల్డోస్టిరాన్‌ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్‌, ఆల్డోస్టిరాన్‌ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్‌ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్‌ చేయడానికి మందులు ఉన్నాయి.


ఎంత తీసుకోవాలి?

రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.


పారిశ్రామిక ఉత్పత్తి

ఉప్పు ముఖ్యంగా సముద్రపు నీటి నుండి తయారుచేయబడుతుంది. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), మరియు కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది.




ఉప్పు ఉపయోగాలు

ఉప్పు ఉపయోగాలు అనంతం,
ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరె. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది. ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటి తో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటి తో కడగ మంటారు. ఇది మంచి ప్రాధమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది. మనుషులకే కాదు చెట్లకు కూడ ఉప్పు ఉపయోగముంది. కొబ్బరి చెట్లకు మువ్వ తెగులుకు ఉప్పు వాడతారు. వంగ మొక్కజొన్న వంటి పంటలకు సోడియం క్లోరైడ్ ను ఎరువుగా వాడతారు. జంతువులకు, వివిధ రకాల వనమూలికల తో చేసిన పొడిని ఉప్పు కలిపి తినిపిస్తారు. దాన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది ఆవులకు, గొర్రెలకు చాల దివ్వ ఔషదం. మామూలు కూరల్లోనె కాదు స్వీట్లు, బ్రెడ్, బిస్కట్, పిజ్జాలు, ఐస్క్రీంలు, జంకు వుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఇలా అన్నింటిలోను రుచి కొరకు, నిల్వ కొరకు ఎంతో కొంత ఉప్పు వాడాల్సిందె. 1675 లో బ్రిటిష్ లో ఉప్పు పై అధిక పన్నుకు ప్రతి కూలంగా ప్రజా పొరాటం జరిగింది. బ్రిటిష్ పాలకులు ఉప్పు తయారి పై సుంకం విధించి నందున దానికి వ్యతిరేకంగా మహాత్మ గాంధి నడిపించిన "ఉప్పు సత్యాగ్రహం" స్వాతంత్రోద్యమంలో ఎంతో ప్రధాన ఘట్టమనే సంగతి తెలియని వారుండరు. కొన్ని ప్రాంతాలలో శవాలను ఖననం చేసేటపుడు తప్పని సరిగా ఉప్పును కూడ వేస్తారు. మన దేశంలో ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనె నియమంకూడ వున్నది. ఉప్పును చేతికి ఇవ్వరు ......... తీసుకోరు, (నూనెలకు కూడ ఈ నియమం ఉన్నది) ఉప్పును దొంగలించరు. ఇలా ఉప్పుకు సంబందించిన కొన్ని ఆచారాలున్నాయి.

ఉప్పు వల్ల ఉపయోగాలేమంటే ఉప్పు వేసిన వంటలు త్వరగా ఉడుకుతాయి. దానివలన ఇందనం, సమయం ఆదా. ఉప్పు నీరు వంద డిగ్రీల వద్ద మరిగి ఆవిరై పోదు. సున్న డిగ్రీల వద్ద గడ్డ కట్టి పోదు. ఒకరి మీద కృతజ్ఞత చెప్ప డానికి "మీ ఉప్పు తిన్న వాడిని" అంటారు గాని "మీ తిండి తిన్న వాణ్ణి" అనరు. అదే ఉప్పు ఘనత. ఉప్పు ఘనత కారణంగా కొన్ని నగరాలు వెలిశాయి. బ్రిటన్ లోని లివర్ పూల్నిన్న నగరం. ఉప్పు ఎగుమతితో అనారం చిన్న స్థాయి నుండి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. ఆస్ట్రియా లోని శాల్జ్ బర్గ్ నగరాన్ని ది సిటి ఆఫ్ సాల్ట్ అని పిలుస్తారు, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు ఉప్పును జీతంగా ఎచ్చేవారు. ఇంకొన్ని ప్రాంతాలలో ఉప్పును మారకద్రవ్యంగా వాడారు. ఆ హార పదార్థాల నిల్వకు అతి సులువైన మార్గం ఉప్పులో ఊర వేయటం. ఊరగాయలు, చేపలు, మాంసం మొదలగునవి ఉప్పులొ నిల్వ తో ఎగుమతిలో జరిగే జాప్యాన్ని తట్టు కుంటాయి. ఉప్పుని పారిశ్రామిక ఉత్పత్తుల్లొ ఎక్కువ గా వాడతారు. ఎన్నో పార్మాసూటికల్స్ తయారికి ఉప్పే ముఖ్యమైన ముడి సరుకు. కీలక రసాయానాలను తయారు చేయడానికి ఉప్పే ముడి సరుకు. వాటితో ఫార్మాసూటి కల్ మందులు, మైక్రో చిప్ లు, ఆప్టికల్ ఫైబర్లు, కేబుల్సు, ప్లాస్టిక్ పైపులు మొదలగు వేల రకాల వస్తువుల తయారికి ఉప్పు అత్యవసరం. దృవ ప్రాంతాల దేశాలలో కొన్ని సీజన్లలో మంచు దారాపాతంగ కురుస్తుంది. నేలంతా గడ్డ కట్టిన మంచుతో పేరుక పోతుంది. రోడ్లపై అతుక్కు పోయిన మంచును పెకలించి తొలిగించడం చాల కష్టం. దాంతో రోడ్ల పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోతాయి. ఆమంచును తొలగించడానికి ఉప్పే శరణ్యం. ఎలాగంటే మామూలు నీటి లాగ ఉప్పు నీరు సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టదు. కనుక రోడ్డుపై ఉప్పు నీరు చల్లితే కురిసిన మంచు గడ్డ కట్టినా రోడ్డుకు అతుక్కొనదు. మంచుకు, రోడ్డుకు మధ్యన ఉప్పు నీటి పొర వున్నందున మంచు రోడ్డు కు అతుక్కోదు. అంచేత దాన్ని తొలిగించడము చాల సులబం. అటు వంటి దేశాలలో ఉప్పును ఎక్కువగా వాడేది రోడ్లపై నున్న మంచును తొలగించడానికే. అందుకని రహదారుల వెంబడి పెద్ద పెద్ద ఉప్పు నిల్వ ఉన్న గిడ్డంగులుంటాయి. మంటలను ఆర్పడానికి కూడ ఉప్పును వినియోగిస్తారు. మంటలలోని వేడిని ఉప్పు గ్రహిస్తుంది. అది ఆక్సిజన్ తో సంయోగం చెంది ఆప్రదేశంలో ఆక్సిజన్ తగ్గి మంటలను ఆర్పడానికి దోహద పడుతుంది. అగ్గికి విరొది నీరే కాదు ఉప్పు కూడా. అందుకే ఉప్పు---నిప్పు అంటారు. " వారిద్దరు ఉప్పు నిప్పు" అనే సామెత అందుకే వచ్చంది.

ఉప్పు వల్ల అన్నీ ఉపయోగాలేనా అంటే అదేంకాదు. ఉప్పు అధికమైతే అరోగ్య పరంగా అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అధిక రక్త పోటుకు మోతాదు మించిన ఉప్పే కారణమని వైద్యులు అంటున్నారు. తద్వార వచ్చె అనేక గుండె జబ్బులకు పరోక్షంగా ఉప్పే కారణం అని వైద్యులు తేల్చి చెప్పుతున్నారు. ఆమధ్యన న్యూయార్కులో నగర పాలకులు హోటళ్లలో ఏ వంటలోను వుప్పు వేయ కూడదని అలా వేస్తే జరిమానా విధిస్తామని ఉత్తర్వులిచ్చారు. తినేవారు తమకు కావలసిన ఉప్పును వారె వేసుకుంటారని . ఇదంతా ప్రజారోగ్య పరి రక్షణకె నని వారి వాదన.
ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఉప్పు గురించి అన్ని విషయాలు వివరంగా అందించడానికి ప్రముఖ ఉప్పు తయారీ దారులంతా కలిసి "సాల్ట్ ఇన్ స్టిస్ట్యూట్ ను నెలకొల్పారు. ఇది అమెరికాలోని అలెగ్జాండ్రియాలో వున్నది. ఇన్ని ఉపయోగాలున్న ఉప్పు గురించి పాఠశాల విద్యార్తులకు చెప్పితే చిన్నప్పుడే వారికి ఉప్పు విలువ తెలుస్తుందని ....ఉప్పు ఉపయోగాల గురించి పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఉపాద్యాయులకు ఉచితంగా ఇస్తున్నారు. ..

ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. (మూలం,,, 14 ఆగస్టు...2011 ఆంధ్ర జ్యోతి.)


ఉప్పుతో చెలగాటమాడవద్దు...






'దేనితో అయినా పెట్టుకోండి కాని ఉప్పుతో మాత్రం చెలగాటమాడవద్దు...'


ఉప్పు తిన్న పాపానికి అని తెలుగులో సామెత ఉంది కదా. అతి చౌక వస్తువు అయిన ఉప్పును అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది కాని ఉప్పు పూర్తిగా మానేస్తే కూడా ప్రమాదమే మరి. అందుకనే శరీరానికి పోషక విలువలను అందించడానికి గతంలో ఉప్పులో అయోడిన్ కలిపితే ఇప్పుడు నేరుగా ఇనుమునే కలపమని వైద్యులు సిపార్సు చేస్తున్నారు మరి.

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా రక్తహీనతకు దారితీస్తుంది.

ఇందుకు ప్రధాన కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి పోషకాలు కావాలి. ఐరన్ లోపం కారణంగా రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

మనం రోజూ తినే అన్నం ద్వారా కూడా ఇనుము పొందగలిగే రోజు రానుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇనుము శాతాన్ని పెంచి, ఫెటేట్స్ పరిమాణాన్ని తగ్గించి జన్యుపరివర్తిత బియ్యాన్ని తయారుచేస్తున్నారు.

అయోడైజ్ ఉప్పు మాదిరిగా ఉప్పులో ఇనుము కూడా కలుపుతున్నారు. దీనిలో ఇనుము, అయోడిన్ సమాన పరిమాణంలో ఉంటాయి. పేద, ధనిక తేడా లేకుండా అందరూ వాడే వస్తువు ఉప్పు. అందుకే ఉప్పును ఎంచుకున్నారు. అయితే రెండేళ్ళ కన్నా తక్కువ వయసు పిల్లలకు ఇది ఉపయోగకరం కాదు.

జాతీయ పోషకారహార సంస్థ నేషనల్ అనీమీయా కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఇనుము, ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను సరఫరా చేయాలని సంకల్పించింది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున చిన్నారులకు అందివ్వగలిగితే చాలా వరకు ఇనుము లోపాలను అధిగమించవచ్చు. ఒక్కో ఐరన్ ట్యాబ్లెట్‌లో వంద మిల్లీగ్రాముల ఐరన్, 0.5 మిల్లీ గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. అలాగని ఉప్పు తగ్గించడం అంటే అన్నంలోనూ, కూరలోనూ, రసంలోనూ వేసుకుని తినే ఉప్పును తగ్గించడం అని కాదు అర్థం. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తుంటారు. మార్కెట్లో చిరుతిండ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు కొనేటప్పుడు వాటిపై ఉండే వివరాలు ఎంతమంది చదివి ఎంచుకుంటున్నారో పరిశీలించుకోవాలి. బయట మనకు కనబడే సవాలక్ష పదార్థాల్లో ఉప్పు వేటిలో తక్కువగా ఉందో వాటినే కొనుక్కోవాలి.

వంటింటిలోకి ఉప్పు ఎక్కువ ఉన్న పదార్ధాలు చేరకుండా చూసుకోవడం చాలా అవసరం. వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా చేర్చి వాడితే ఉప్పును తగ్గించి తీసుకోవడం తేలికవుతుంది మరి.

గుండె ఆరోగ్యాన్ని పదిలపర్చుకునేందుకు అసంతృప్త ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వెన్న బదులు ఆలివ్ నూనె, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తుల వంటివి తీసుకోవాలి.

శరీరం బరువును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. క్రమం తప్పని వ్యాయామంతో పాటు అన్నివేళలా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కుతూ దిగడం, సమీప ప్రాంతాలకు బండి బయటకు తీయకుండా నడిచి వెళ్లడం వంటివి రక్తపోటు అదుపుకు చక్కటి మార్గాలు.

పోటాషియం పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. బిస్కెట్లు ఇతర చిరుతిండ్లకు బదులు రోజూ అయిదు సార్లు పండ్లు తినగలిగే స్తోమత ఉంటే మరీ మంచిది. రక్తపోటు అదుపుకు ఇది చాలా మంచి పద్దతి.

భోజనంలో వాడే ఉప్పును కొలిచేందుకు పాతరోజుల్లో గోరెడు, చిటికెడు చారెడు వంటి చేతి కొలమానాలను ప్రయోగించేవారు. ఇప్పుడు ఇవి కూడా ఆరోగ్యానికి ప్రమాదకారులుగా మారుతున్నాయి. కాబట్టి పాత సామెతను మనం కాస్త మార్చుకుంటే మంచిదేమో కదూ..




కాబట్టి ఉప్పులో ఏముంది ఘనత అని తీసిపారవేస్తే ఇకపై కష్టమే అని వైద్య నిపుణులు అంటున్నారు.


 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు

 డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు.
  అలాగే ఒక వ్యక్తి రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు.
 ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి...
 1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ...     రోజుకు 2 గ్రాముల ఉప్పు (అంటే 0.8 గ్రా. సోడియమ్ కోసం)
 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో...     రోజుకు 3 గ్రాముల ఉప్పు (అంటే 1.2 గ్రా. సోడియమ్ కోసం)
 7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో...     రోజుకు 5 గ్రాముల ఉప్పు (అంటే 2 గ్రా. సోడియమ్ కోసం)
 11 ఏళ్లు పైబడ్డ పిల్లలకు...    రోజుకు 6 గ్రాముల ఉప్పు (అంటే 2.4 గ్రాముల సోడియమ్ కోసం) కావాలి.

 ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తాము వాడాల్సిన ఉప్పును నిర్ణయించుకొని, దాన్ని అదే మోతాదులో పరిమితికి మించకుండా తీసుకుంటే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది.


 స్వతహాగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలివి...
 ఉప్పు పరిమితికి మించితే అది అనారోగ్య హేతువు అన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వతహాగా ఉప్పు ఎక్కువ పాళ్లలో ఉండే ఆహారాలను పరిహరించాలి. ఆ ఆహార పదార్థాల్లో కొన్ని...

 అప్పడాలు
 పచ్చళ్లు
 బేకరీ ఐటమ్స్
 సాస్
 నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్
 స్మోక్‌డ్ మాంసాహారం
  చీజ్
 సలాడ్స్
 సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు
 దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్.

 ఉప్పు విపరీతంగా తగ్గితే కనిపించే లక్షణాలు
 శరీరంలో ఉప్పు పెరిగితే అది ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. అలాగే శరీరంలో ఉప్పు పాళ్లు విపరీతంగా తగ్గినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... 

 తీవ్రమైన అలసట  (ఫెటీగ్)
 తలనొప్పి
 కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్)
 హైపోనేట్రీమియా కండిషన్: ఆహారంలో ఉప్పు విపరీతంగా తగ్గడం వల్ల ఏర్పడే హైపోనేట్రీమియా అన్న కండిషన్ వల్ల ఒక్కోసారి ఐసీయూలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

 ఉప్పు ఎక్కువ కావడం వల్ల కనిపించే లక్షణాలు
 విపరీతమైన దాహం

 కిందినుంచి అపానవాయువు రూపంలో గ్యాస్ పోవడం (బ్లోటింగ్)

 పై అంశాలన్నింటినీ బట్టి ఆహారంలో ఉప్పును తగ్గనివ్వకూడదు, అలాగని మించనివ్వకూడదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

 నిర్వహణ: యాసీన్

 గర్భిణులూ జాగ్రత్త!

 కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. తక్కువ బరువున్న పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 8 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గవచ్చు. అందుకే ఇలా ఉప్పు బాగా తగ్గించి తీసుకునే కుటుంబాల్లోని గర్భవతులు తమ సోడియమ్ అవసరాల కోసం స్వాభావికంగా ఉప్పు లభ్యమయ్యే కూరగాయలు, తాజాపండ్లు, పండ్లరసాల వంటివి ఎక్కువ పరిమాణంలో తప్పక తీసుకోవాలి.
 

No comments:

Post a Comment