10 Aug 2015

మటన్ తో రుచులు

ఒక్క మటన్ పది కూరల పెట్టు.
అంతే సారం. పదింతల బలం.
సింగిల్ మటన్... టెన్ టేస్ట్స్.
అందుకే దాన్ని మ‘టెన్’ అంటే ఎవరికైనా డౌట్ ఏముంటుంది?
పండగనాడు ఒక్క మటన్ చాలు...
అదే పదివేల టేస్టులు. పదిరోజుల పండగ దసరా!
ఆ నాటి రుచిని పది కాలాలు తలచుకునేలా మటన్ ఐటమ్స్ చేసుకుందాం రండి.

వేపుడు:
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ - అరకిలో, అల్లం ముద్ద - ఒక టీ స్పూను, అల్లం తురుము - ఒక టేబుల్ స్పూను, వెలుల్లి ముద్ద - ఒక టీ స్పూను, వెల్లుల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూను, కారం - ఒక టీ స్పూను, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉల్లిపాయలు - ఒకటి, చిన్న ఉల్లిపాయలు - ఆరు, కొబ్బరి తురుము - అరకప్పు, గరం మసాలా - ఒక టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, దాల్చిన చెక్క ముక్కలు - నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగించి అందులో మటన్ ముక్కలు వేసి పూర్తిగా ఉడికాక ఉడికించి దించేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో సరిపడా నూనె పోసి కొబ్బరి తురుము, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు, తొక్క తీసిన చిన్న ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత ఉడికించిన మటన్, గరం మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు వేగించి దించేయాలి.

పకోడి:
కావలసిన పదార్థాలు:బోన్‌లెస్ మటన్ - పావుకిలో, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు, శెనగపిండి - అర కప్పు, కారం - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్ర పొడి - ఒక టీ స్పూను, అల్లం ముద్ద - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: మటన్‌ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరో గిన్నెలో మొక్కజొన్న పిండి, శెనగపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం ముద్ద, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు జారుగా కలుపుకోవాలి. అందులో మటన్ ముక్కలు వేసి ఓ పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మరో గిన్నెలో సరిపడా నూనె పోసి బాగా కాగాక మటన్ పకోడీలు వేసుకోవాలి.

బిర్యాని:
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ - అరకిలో, బాస్మతి బియ్యం - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, గరం మసాలా - ఒక టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, లవంగాలు - ఐదు, దాల్చిన చెక్కలు - నాలుగు, కొత్తిమీర కట్ట - ఒకటి, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: 

ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగించాలి. తరువాత మటన్‌వేసి బాగా ఉడికించి దించేయాలి. తరువాత మరో మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తర్వాత బియ్యం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి వేగించాలి. ఓ ఐదు నిమిషాలు వేగించాక ఉడికించిన మటన్ వేసి మరో ఐదు నిమిషాలు వేగించాలి. తర్వాత వంతుకు వంతున్నర నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము వేయాలి.

పులుసు:
కావలసిన పదార్థాలు: మటన్(ఎముకలతో సహా) - అరకిలో, ఉల్లిపాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను, చింతపండు - కొద్దిగా, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - మూడు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, గరం మసాలా - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూన్లు, కరివేపాకు - ఒక రెబ్బ, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: 

గిన్నెలో సరిపడా నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మటన్ కూడా వేసి వేగించాలి. సన్నని మంటపై ఓ పదినిమిషాల వేగించిన తర్వాత ఒక గ్లాసు చింతపండు నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము వేసుకోవాలి.

మటన్ రోస్ట్


కావలసినవి:
మటన్ - కప్పు
పసుపు - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - కప్పు
మిరియాల పొడి - టీ స్పూన్
చాట్ మసాలా - టీ స్పూన్
నిమ్మరసం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారి:
బాణలిలో నూనె వేడి చేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మాంసం ముక్కలు వేసి కలిపి పైన చాట్‌మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి. మటన్ రోస్ట్ రెడీ.


మటన్ గోంగూర


కావలసినవి:
మటన్ - కప్పు గోంగూర - కప్పు గసాలు - 50 గ్రా
జీడిపప్పు - 10 గ్రా, నూనె - సరిపడా
పోపు కోసం:
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, కారం - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్
గరం మసాలా పొడి - చిటికెడు

తయారి:
గసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మిగిలిన పోపు దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అన్నీ వేగిన తర్వాత మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర, గసాలాజీడిపప్పు మసాలా వేసి ఉడికిస్తే గోంగూర మటన్ రెడీ.


కర్టెసీ: రాయలసీమ రుచులు, జూబ్లీహిల్స్, హైదరాబద్
చెఫ్: గణేశ్ గారు

Thankyou http://ruchulapage.blogspot.in/

No comments:

Post a Comment