22 Aug 2015

ప్రోస్టేట్ గ్రంధి వాపు - క్యాన్సర్‌ వస్తోందేమో గమనిస్తుండాలి మరియు జాగ్రత్తలు

ప్రోస్టేటు గ్రంథి.. మలి వయసు పురుష లోకంలో కలవరాన్ని పెంచుతోంది! వయసులో ఉన్నంత కాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి.. మలివయసుకు దగ్గరవుతున్నకొద్దీ కొద్దికొద్దిగా ఉబ్బటం ఆరంభమవుతుంది. అది సహజం! దానివల్ల మూత్రం ఆపుకోలేక పోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలు మొదలవ్వటమూ అంతే సహజం. దీన్నే 'బీపీహెచ్‌' అంటారు. ఈ బాధలు, ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ... కొద్దిమందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో.. పూర్తిగా ఇదే తీరులో.. ప్రోస్టేటు క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు! దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేదు. కాబట్టి మలివయసులో మూత్ర సమస్యలు వేధిస్తున్నప్పుడు తక్షణం వైద్యులకు చూపించుకోవటం.. అది క్యాన్సర్‌ కాదని స్పష్టంగా నిర్ధారణ చేయించుకోవటంచాలా ముఖ్యం. ఒకవేళ క్యాన్సర్‌ అయితే ఎలా ఎదుర్కోవాలన్నదీ అంతే ముఖ్యం.

పౌరుష గ్రంథి.. అస్థీల గ్రంథి.. ప్రోస్టేటు గ్రంథి.. ఇలా పేరు ఏదైనా అది పురుషులకు అత్యంత కీలకమైన గ్రంథి! మూత్రాశయం కిందే... పెద్ద ఉసిరికాయ ఆకారంలో.. మూత్ర మార్గం చుట్టూ ఆవరించి ఉండే ఈ గ్రంథి.. వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది.సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు.. ఈ ప్రోస్టేటు గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే 'వీర్యం' రూపంలో బయటకు వస్తుంటాయి. ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది.కానీ పురుషులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఇది పెద్దదిగా ఉబ్బటం.. ఫలితంగా మూత్ర విసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తటంచాలా సహజ పరిణామంగా మారింది. దీన్నే 'బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా(బీపీహెచ్‌)' అంటారు. ఇది ఇబ్బంది పెట్టేదేగానీ ప్రమాదం తెచ్చిపెట్టేది కాదు. కానీ సరిగ్గా ఇదే వయసులో... ఇదే లక్షణాలతో ప్రోస్టేటు గ్రంథిలో క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు. ఈక్యాన్సర్‌ పాశ్చాత్య దేశీయులతో పోలిస్తే మన ఆసియా వాసుల్లో తక్కువేగానీ.. మన దగ్గర దీనిపై సరైన చైతన్యం, దీన్ని ముందుగా గర్తించే స్క్రీనింగ్‌ పరీక్షలపై అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది దీన్ని బాగా ముదిరిపోయిన తర్వాతగానీ గుర్తించలేకపోతున్నారు.అప్పటికే క్యాన్సర్‌ ప్రోస్టేటు గ్రంథిని దాటిపోయి.. ఎముకలకు ఇతరత్రా అవయవాలకు పాకిపోతోంది. ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకూ నయం చేసే, సమర్థంగా నియంత్రించే చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే మలివయసులో మూత్ర విసర్జనలో బాధలు ఎదురవుతున్నప్పుడు తప్పకుండా అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేయించుకోవటం అవసరం.


ఎవరికి ఎక్కువ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధుల్లో ఎక్కువ. 40 ఏళ్ల లోపు వారిలో అరుదు. బ్యాటరీ పరిశ్రమల్లో కాడ్మియం ప్రభావానికి లోనయ్యే వారిలోనూ ఎక్కువ. ఇది ఎందుకొస్తుందో స్పష్టమైన కారణమేదీ తెలియదు. కానీ తలసరి కొవ్వు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదీ ఎక్కువ. మన దేశంలో మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది అరుదే అయినా సంపన్న, పట్టణ వర్గాల్లో, కొవ్వు ఎక్కువగా తినే వారిలో ఎక్కువగా కనబడుతోంది.

లక్షణాలేమిటి: ప్రోస్టేట్‌ క్యాన్సరుకంటూ ప్రత్యేకమైన లక్షణాలేమీ లేవు. వయసుతో వచ్చే 'బీపీహెచ్‌' సమస్యలో ఉన్నట్టే దీనిలోనూ- తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, బొట్లుబొట్లుగా వస్తుండటం, మూత్రాన్ని ఆపులేకపోవటం వంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను వయసుతో సహజంగా వచ్చే 'బీపీహెచ్‌'వే అని కొట్టిపారెయ్యకుండా క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకోవటం అవసరం. తొలిదశలోనే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సూచనలు మనకు 'పీఎస్‌ఏ' పరీక్షలో అందుతాయి. క్యాన్సర్‌లో మరింత ఎక్కువగా పెరుగుతుంది. సమస్య నిర్ధారణలో ఈ పరీక్ష అత్యంత కీలకమైనది.

గుర్తించేదెలా: 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పురుషుడూ ఏటా 'పీఎస్‌ఏ' పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం. ఈ 'పీఎస్‌ఏ' పెరుగుదల ఎక్కువగా ఉంటే క్యాన్సరేమోనని అనుమానించటం శ్రేయస్కరం. దీనితో పాటు వైద్యులు మలద్వారం గుండా వేలు పెట్టి.. ప్రోస్టేటు గ్రంథిని నొక్కి చూస్తారు. దీన్నే 'డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌' అంటారు. ఇలా నొక్కినప్పుడు ఈ గ్రంథి పెద్దగా అవటమేకాదు, క్యాన్సర్‌ సోకితే అది చాలా గట్టిగా కూడా తగులుతుంది. దీంతో క్యాన్సర్‌ అనుమానం బలపడుతుంది. ప్రోస్టేటు క్యాన్సర్‌ను కచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు ప్రోస్టేటు గ్రంథి నుంచి ముక్కతీసి పరీక్షించే 'బయాప్సీ' ఒక్కటే మార్గం. అయితే దీన్ని ఎవరికి, ఎప్పుడు బయాప్సీ చెయ్యాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.

'పీఎస్‌ఏ' కీలకం!
'పీఎస్‌ఏ' రక్తపరీక్ష ముఖ్యంగా ప్రోస్టేటు గ్రంథి స్వభావాన్ని చెప్పే పరీక్షేగానీ.. క్యాన్సర్‌కు ప్రత్యేకించింది కాదు. కాబట్టి ఇది మనం బలంగా అనుమానించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. 'పీఎస్‌ఏ' మోతాదు పెరిగితే క్యాన్సర్‌గా అనుమానించాలి, నిర్ధారించుకునేందుకు ఇతర పరీక్షలు చెయ్యాలి. పీఎస్‌ఏ సాధారణంగా వయసును బట్టి 0-4 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ మధ్య ఉంటుంది. వయసును బట్టి ఇది ఆ లోపు ఉంటే ఫర్వాలేదు. ఏ వయసు వారికైనా 'పీఎస్‌ఏ' 10 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ కంటే ఎక్కువుంటే తక్షణం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉందేమో తెలుసుకునేందుకు గ్రంథి నుంచి ముక్క తీసి (బయాప్సీ) పరీక్ష చేయాలి. ఒకవేళ పీఎస్‌ఏ 4-10 మధ్య ఉంటే అప్పుడు బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించటం కీలకం. అందుకు పీఎస్‌ఏ డెన్సిటీ, పీఎస్‌ఏ వెలాసిటీ, ఫ్రీ పీఎస్‌ఏ.. వంటి ఇతర పరీక్షలు మనకు కీలక సమాచారాన్నిఅందిస్తాయి. వాటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. వాటి గురించి వివరంగా..

వయసు: పీఎస్‌ఏ స్థాయి ఎంత ఉండొచ్చన్న దానికి వయసు ప్రాతిపదిక. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెరుగుతుంటుంది. ఉదాహరణకు 40-49 ఏళ్ల వారిలో 0-2.5 ఉంటే నార్మల్‌. అంటే 45 ఏళ్ల వ్యక్తికి పీఎస్‌ఏ 4 ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థం. అదే 75 ఏళ్ల వ్యక్తికి 6.5 ఉన్నా కూడా దాన్ని మరీ తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి బయాప్సీ అవసరమన్నది నిర్ధారించటంలో ఇది ఒక కీలకాంశం.

పీఎస్‌ఏ డెన్సిటీ: వయసుతో పాటే ప్రోస్టేట్‌ గ్రంథి సైజూ పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి... ప్రోస్టేట్‌ గ్రంథి సైజుకు అనుగుణంగానే పెరిగిందా? ఇంకా ఎక్కువగా పెరిగిందా? అన్నది తెలుసుకోవటం దీని ఉద్దేశం.

పీఎస్‌ఏ వెలాసిటీ:
ఇది కొంత క్లిష్టమైన లెక్క. ఏడాదికి ఒకసారి పీఎస్‌ఏ చెయ్యాలి. కాలక్రమేణా అది ఏ రేటులో పెరుగుతోందన్నది లెక్కించాలి. ఇది కూడా ముఖ్యమే

ఫ్రీ పీఎస్‌ఏ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే.. 'టోటల్‌ పీఎస్‌ఏ' ఎక్కువుంటుంది.. కానీ దానిలో 'ఫ్రీ పీఎస్‌ఏ' అన్నది తగ్గుతుంటుంది. దీన్ని బట్టి కూడా అనుమానించటం అవసరం. వీటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.
*
ప్రోస్టేట్‌ గ్రంథి వాపులో, సిస్టోస్కోపీ తర్వాత, ప్రోస్టేట్‌ గ్రంథి బయాప్సీ తర్వాత ఆరు వారాల వరకూ కూడా పీఎస్‌ఏ స్థాయి పెరిగే ఉంటుంది, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి పీఎస్‌ఏ పెరిగిందంటే ఇవన్నీ చూడటం అవసరం.
* అలాగే క్యాన్సర్‌ బాధితుల్లో ఓ 10% శాతం మందిలో పీఎస్‌ఏ మోతాదు పెరగకుండానూ ఉండొచ్చు. కానీ వీరిలో లక్షణాలుంటాయి. కాబట్టి లక్షణాలు బలంగా, తీవ్రంగా ఉన్నప్పుడు బయాప్సీకి వెళ్లటం ఉత్తమం.


ఇతర పరీక్షలు
బయాప్సీలో క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయితే.. వెంటనే ఆ క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉన్నదీ తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌/ఎమ్మారై బాగా ఉపయోగపడతాయి. కణితి ఎక్కడుంది? అది గ్రంథిని దాటి బయటకు వెళ్లిందా? శుక్రాశయాలకు (సెమినల్‌ వెసికిల్స్‌) కూడా పాకిందా? వంటివన్నీ సీటీ స్కానింగులో తెలుస్తాయి.
* స్పష్టమైన కారణమేంటో తెలియదుగానీ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుంటుంది. కాబట్టి వీరికి 'బోన్‌ స్కాన్‌' కూడా అవసరం. బోన్‌ స్కాన్‌లో క్యాన్సర్‌ ఆనవాళ్లు కనబడుతున్నాయంటే వ్యాధి బాగా ముదిరిన దశకు వెళ్లిందనే అర్థం.


గ్లీసన్స్‌ స్కోర్‌
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్వభావం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ అంచనా స్కోరు. బయాప్సీ పరీక్షలో క్యాన్సర్‌ కణాల రూపురేఖలను బట్టి ఈ గ్లీసన్‌ స్కోరు నిర్ధారిస్తారు. దీన్ని 2-4, 5-6, 7-10గా విభజిస్తారు. ఈ స్కోరు 2-4 ఉంటే క్యాన్సర్‌ తీరు చాలా నిదానంగా ఉందని (లోగ్రేడ్‌) అర్థం. దీంతో మరణించే అవకాశం 10 శాతం కన్నా తక్కువ. ఇదేమంత త్వరగా ఇతర భాగాలు వ్యాపించదు. కాబట్టి చికిత్స తీసుకుంటే దీనితో పెద్ద ఇబ్బంది లేకుండా జీవితం గడిపెయ్యచ్చు. ఇక స్కోరు 5-6 ఉంటే ఇది మధ్యస్థ రకం. దీనితో ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. ఇక స్కోరు 7-10 ఉంటే అది ఉధ్ధృత రకం. ఇది ప్రాణాంతకమైంది. వేగంగా లింఫ్‌గ్రంథులకు, ఎముకలకు వ్యాపించే రకం ఇది.
హార్మోన్ల చికిత్స కీలకం!
మన శరీరంలో పురుష హార్మోన్లను వృషణాలు ఉత్పత్తి చేస్తాయి, మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్‌ గ్రంథులూ ఉత్పత్తి చేస్తాయి. రెంటినీ అడ్డుకోవటం అవసరం. మనం వృషణాలను తీసివెయ్యటం లేదా 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్స్‌' ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను అడ్డుకోవచ్చు. కానీ అడ్రినల్‌ గ్రంథుల నుంచి వచ్చే వాటిని మాత్రం వీటితో అడ్డుకోలేం. దానికోసం సిప్రోటిరాన్‌ ఎసిటేట్‌, లేదా ఫ్లూటమేట్‌ వంటి యాంటీ యాండ్రోజెన్‌ రకం మందులు (యాండ్రోబ్లాక్‌ మొ||) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెంటినీ ఇవ్వటాన్నే 'టోటల్‌ యాండ్రోజెన్‌ బ్లాకేడ్‌' అంటారు. ఇది 1980ల నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి కేవలం వృషణాలు తీసెయ్యటం లేదా ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌ ఇంజెక్షన్లు చెయ్యటమే కాకుండా.. ఈ 'యాంటీ యాండ్రోజెన్‌' మందులూ ఇవ్వటం అవసరం. ముఖ్యంగా- ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత తొలి రెండు వారాల్లో అవి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆ తర్వాత అడ్డుకుంటాయి. ముందు 14 రోజుల పాటు 'యాంటీ యాండ్రోజెన్‌' బిళ్లలు ఇచ్చి.. ఆ తర్వాత ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్‌ ఇవ్వటం ఉత్తమం. ఒకవేళ ఇంజక్షన్లు కాకుండా వృషణాలు తీసివేసే ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే నేరుగా, ఎప్పుడైనా దానికి వెళ్లొచ్చు. ఇదీ ఇప్పుడు ప్రామాణిక చికిత్స.
నివారించుకోలేమా?
ప్రోస్టేటు క్యాన్సర్‌ను నివారించుకోవటానికి కచ్చితమైన మార్గమేం లేదు. చిన్నతనం నుంచీ కొవ్వు తక్కువ తినటం మంచి అలవాటు. శాకాహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినటం ఉత్తమం. 50 ఏళ్ల నుంచీ ఏటా తప్పనిసరిగా 'పీఎస్‌ఏ' రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
చికిత్స ఏమిటి?
మొత్తానికి మూడు రకాలు: 1. తొలిదశ క్యాన్సర్‌. (ఎర్లీ) 2. గ్రంథిలోనే బాగా ముదిరిన రకం (లోకల్లీ అడ్వాన్స్‌డ్‌) గ్రంథి చుట్టూ, పక్కనే ఉండే శుక్రాశయాలకు పాకి ఉంటుంది. 3. గ్రంథి నుంచి బయటకు పాకి.. లింఫ్‌గ్రంథులు, ఎముకల వంటి ఇతరత్రా అవయవాలకు వ్యాపించిన రకం (మెటాస్టాటిక్‌)

1. తొలి దశ క్యాన్సర్‌
* క్యాన్సర్‌ ఇంకా గ్రంథిలోనే ఉంది కాబట్టి సర్జరీ చేసి గ్రంథి మొత్తాన్ని తొలగించటం (ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ) ఒక విధానం. లేదంటే రేడియేషన్‌ థెరపీ అయినా ఇవ్వచ్చు.

* గ్రంథిని, దానికి ఆనుకుని ఉన్న కణజాలాన్ని, లింఫ్‌గ్రంథులను పూర్తిగా తొలగించేందుకు కోతబెట్టి చేసే పద్ధతి లేదంటే కేవలం రంధ్రాలతోనే చేసే ల్యాప్రోస్కోపీ విధానాలను అనుసరించవచ్చు. కోతబెట్టి చేసే సర్జరీలతో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ల్యాప్రోస్కోపిక్‌ విధానాన్నే అనుసరిస్తున్నారు. పీఎస్‌ఏ 10 కంటే తక్కువ, గ్లీసన్‌ స్కోరు 6 కంటే తక్కువ ఉన్న వారికి సర్జరీతో మంచి ప్రయోజనం ఉంటుందని గుర్తించారు.

* సర్జరీతో... మొత్తమ్మీద ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ సర్జరీ వల్ల వచ్చే దుష్ప్రభావాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 4% మందిలో మూత్రం ఆపుకోలేని సమస్య; 30% మందిలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పొట్టలో ఒత్తిడి పెరిగినప్పుడు మూత్రం లీకవ్వటం, 4% మందిలో మూత్రమార్గం సన్నబడటం (స్ట్రిక్చర్స్‌), కొందరిలో అంగ స్తంభన సమస్యల వంటివి తలెత్తుతాయని గుర్తించారు. నాడులు ప్రభావితం కాకుండా చేసే సర్జరీ కూడా ఉంది. దానితో ఈ స్తంభన వంటి ఇబ్బందులేమీ లేకుండా చేసే వీలుంది. దీన్ని రోబో సహాయంతో చేసినప్పుడు దుష్ప్రభావాలు మరింత తక్కువగా ఉంటున్నాయి.


* రేడియేషన్‌తో.. ఇటీవలి కాలంలో ఇమేజ్‌ గైడెడ్‌ రేడియో థెరపీ(ఐజీఆర్‌టీ), ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్‌ రేడియో థెరపీ(ఐఎంఆర్‌టీ) వంటి వాటితో అధిక డోసుల్లో రేడియేషన్‌ను ఇవ్వటం సాధ్యపడుతోంది కాబట్టి.. ఇప్పుడు రేడియేషన్‌ థెరపీతో కూడా సర్జరీతో సరిసమానమైన ఫలితాలే ఉంటున్నాయి. అయితే రేడియేషన్‌ వల్ల- తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటం, విసర్జలో మంట, పొత్తికడుపులో వాపు, వృషణాల తిత్తి వాపు వంటివి 20% వరకూ ఉంటున్నాయి. స్తంభన 40% మందిలో ఉంటుంది. పెద్దపేగు ప్రోస్టేటు గ్రంథి వెనకే ఉంటుంది కాబట్టి 5% మందిలో మలాశయం, మూత్రాశయం కూడా రేడిషన్‌ ప్రభావానికి గురవుతుంటాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని- ఇప్పుడు తొలిదశ క్యాన్సర్‌కు.. సర్జరీని తట్టుకునే ఆరోగ్యం, శక్తి ఉంటే ఏ వయసులోనైనా సర్జరీ చేయించుకోవచ్చు. లేదంటే రేడియేషన్‌ ఇవ్వచ్చు.

2. గ్రంథిలోనే ముదిరిన రకానికి..
* క్యాన్సర్‌ దశ, గ్లీసన్‌ స్కోరు, రోగి ఆరోగ్య స్థితిని బట్టి- వీరికి ముందుగా శరీరంలో హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యటం, ఆ తర్వాత గ్రంథిని సమూలంగా తొలగించే ర్యాడికల్‌ సర్జరీ లేదా రేడియేషన్‌ అవసరమవుతుంది. తర్వాత కూడా పీఎస్‌ఏ తీరును గమనిస్తుండాలి.

* హార్మోన్ల చికిత్స: ప్రోస్టేటు క్యాన్సర్‌ కణాలకు శరీరంలో తయారయ్యే హార్మోన్లే ప్రేరకాల వంటివి. కాబట్టి హార్మోన్లను అడ్డుకోవటం ముఖ్యం. ఈ హార్మోన్లు వృషణాల్లో తయారవుతాయి. అలాగే మూత్రపిండాలపైన ఉండే అడ్రినల్‌ గ్రంథుల్లోనూ తయారవుతాయి. వీటిని అడ్డుకోవటం ద్వారా క్యాన్సర్‌ను నిలువరించవచ్చు. వీరికి వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను నిరోధించే 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌' ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. లేదా సర్జరీ చేసి రెండు వృషణాలనూ తొలగించవచ్చు. ఈ రెంటిలో ఏదైనా ఒకటి చేస్తే చాలు. కాకపోతే ఆ ఇంజెక్షన్లు ఖరీదైనవి, వాటిని ప్రతి 3 నెలలకు ఒకసారి జీవితాంతం చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికంటే ఒక్కసారే వృషణాలు తీసివేసే సర్జరీ తేలిక.


* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చేసిన తర్వాత.. ప్రోస్టేటు గ్రంథిని తొలగించే సర్జరీ, దానికి వీల్లేకపోతే రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌ మరికాస్త చుట్టుపక్కలకు కూడా పాకిందనిపిస్తే సర్జరీ తర్వాత రేడియేషన్‌ కూడా ఇస్తారు.

* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యగానే పీఎస్‌ఏ తగ్గిపోతుంది. కానీ తర్వాత కూడా ఆ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. పీఎస్‌ఏ పెరుగుతుంటే సమస్య ఊపిరితిత్తుల్లో, ఎముకల్లో మరెక్కడన్నా వస్తోందేమో చూసుకోవాలి.

3.ఇతర అవయవాలకూ పాకితే..
దురదృష్టవశాత్తూ మన దేశంలో 90% మంది ఈ దశలోనే గుర్తిస్తున్నారు. ఇది బాగా ముదిరిన దశ. కేవలం హార్మోన్లను నిరోధించే ఇంజెక్షన్లు లేదా వృషణాలను తీసివేసే సర్జరీ ఒక్కటే మార్గం. ఈ దశలో ఇరత్రా మార్గాలతో ప్రయోజనం ఉండదు. అయితే ఈ హార్మోన్ల ప్రభావం ఎవరికైనా 12-24 నెలల పాటు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్‌ కణాలు ఈ హార్మోన్లకు నిరోధకత పెంచుకుంటాయి. ఆ దశలో రకరకాల కీమోథెరపీ మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.

* ప్రోస్టేటు క్యాన్సర్‌ ఎముకలకు వ్యాపించిన వారందరికీ కూడా 'బిస్ఫాస్ఫనేట్స్‌' రకం మందులు ఇవ్వాలి. దీనివల్ల ఎముకల నొప్పి తగ్గి అవి దృఢతరమవుతాయి. చాలామందికి నడుము కింది వెన్నుపూసలు, పొత్తికడుపు ఎముకలు ప్రభావితమవుతాయి. అవసరమైతే ఆ ప్రభావితమైన ఎముకలకు రేడియేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
చికిత్స తర్వాత..?
క్యాన్సర్‌ ఎంత ముదిరింది, ఏ స్టేజిలో ఉంది, గ్లీసన్‌ స్కోరు ఎంత ఉందన్న దాన్ని బట్టి ఫలితాలుంటాయి. పీఎస్‌ఏ రెట్టింపు కావటానికి ఎంతకాలం పడుతుందన్నది కీలకమైన అంశం. దీన్నే 'పీఎస్‌ఏ డబ్లింగ్‌ టైమ్‌' అంటారు. త్వరగా రెట్టింపు అయితే.. దానర్థం క్యాన్సర్‌ బాగా ఉగ్రంగా ఉందని.

డా|| మోహన వంశీ- చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌- ఒమేగా హాస్పిటల్స్‌- హైదరాబాద్‌( సుఖీభవ)

No comments:

Post a Comment