10 Aug 2015

పెండలం తో రుచులు, ఔషధీ లక్షణాలు

ఇతర భాషలలో పేర్లు

సంస్కృతం : ఆలూకం, హిందీ : ఛుప్రీ ఆలు, ఖమాలు, కన్నడ : తెన్గుగెనసు, హెగ్గెనసు, మలయాళం : కాసిల్, కావుట్టు, తమిళం : కస్టన్ కాసిల్, ఆంగ్లము : గ్రేటర్ యాం, ఏషియాటిక్ యామ్

మొక్క వర్ణన

తీగ జాతికి చెందిన ఈ తీగ చెట్ల పైన, నేల పైన పాకుతుంది. ఈ తీగకు దూరం దూరంగా పెద్ద ఆకులు ఉంటాయి. హృదయాకారంలో మొదలు వెడల్పుగా కొస సన్నగా కొలగా పొడుగ్గా ఆకులు ఉంటాయి. ఆకులు ఎదురుబదురుగా ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి అరుదుగా ఉంటాయి. తీగ బాగా ముదిరితే ఎర్రటి కాయలు కాస్తాయి. నేలలో పొడుగుగా దుంపలు పెరుగుతాయి. దుంపలపై మందపాటి ముదురు గోధుమ రంగు బెరడు ఉంటుంది. లోపలి భాగం తెల్లగా ఉంటుంది.

ఔషధీ లక్షణాలు

దుంపలు రుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి. బలవర్థకము. వీర్యవృద్ధి, కామాన్ని పెంచుతుంది. మూత్రము సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. కడుపులో పురుగులను చంపుతుంది. మేహశాంతి కలిగిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. పిత్త రోగములపై పనిజేయును. మధుమేహము, కుష్టు, గనేరియా, మూత్రము బొట్లు బొట్లుగా అగుటను మాన్పును. కాయలు కూర చేసుకొని తినిన దేహ పుష్టి, బలమును కలిగిస్తుంది.

 

పెండలం తో దోశలు

కావలసిన పదార్థాలు: పెండలం దుంపలు - 2, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా. 

తయారుచేసే విధానం:
పెండలం దుంపల్ని తొక్క తీసి ముక్కలుగా తరగాలి. మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, దుంప ముక్కలు వేసి తగినంత నీరు చేరుస్తూ దోశ పిండిలా జారుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర కలిపి కొద్ది దళసరిగా దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా వేగించుకోవాలి. ఈ దోశలు టమోటో చెట్నీతో బాగుంటాయి.

వేపుడు


కావలసిన పదార్థాలు:పెండలం దుంప - 1, పసుపు - పావు టీ స్పూను, జీలకర్ర పొడి - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను. నూనె - 2 టీ స్పూన్లు, జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు.

తయారుచేసే విధానం:
పెండలం దుంపని ముక్కలుగా తరిగి, రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. కడాయిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేగాక చల్లారిన దుంప ముక్కల్ని చేర్చి పసుపు, ఉప్పు, జీలకర్ర, కారం పొడులు చల్లాలి. 3 నిమిషాల తర్వాత దించేసి, వేడివేడిగా అన్నంతో నంజుకుంటే చాలా బాగుంటుంది.

పులుసు
కావలసిన పదార్థాలు: పెండలం దుంప - 1, టమోటా -1, తరిగిన ఉల్లి - 1, చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, పంచదార - 1 టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కారం - 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర - అర టీస్పూను చొప్పున, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి - 2, టమోటా - 1.

తయారుచేసే విధానం:
దుంప ముక్కల్ని రెండు విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించి చల్లార్చి పక్కనుంచాలి. కడాయిలో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పసుపు, ఉల్లి తరుగు వేగించి టమోటా ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. తర్వాత దుంపముక్కలు, చింతపండు గుజ్జు, ఉప్పు, పంచదార, కారం కలిపి 2 కప్పుల నీరు కలిపి సన్నని మంటపై పులుసు చిక్కబడేవరకు మరిగించాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. ఇష్టముంటే చిటికెడు మసాలపొడి పైన చల్లుకోవచ్చు. అన్నంలో కలుపుకుని కమ్మని రుచిని ఆస్వాదించండి.
thankyou http://ruchulapage.blogspot.in

No comments:

Post a Comment