కొత్తిమీర
సువాసనకు, కూరలపై అలంకరించుకోవడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదనుకుంటే
పొరపాటు. కొత్తిమీరతో సాయంత్రం తినడానికి ఎన్నో స్నాక్స్ చేసుకోవచ్చు. ఏ
కూరలో అయినా కొత్తిమీర ఫ్లేవర్ కలిస్తేనే ఎంతో బాగుంటుంది. అలాంటిది
కొత్తిమీర ప్రధాన దినుసుగా చేసుకునే స్నాక్స్ ఇంకెంత రుచిగా ఉండాలి? ఈ
రెసిపీల ప్రకారం వంటింట్లో నాలుగు కొత్తిమీర కట్టలుంటే చాలు బోలెడు
చిరుతిళ్లు చేసుకోవచ్చు. వాటిల్లో కొన్ని ...
కావలసిన పదార్థాలు:
ఉప్పుడు బియ్యం - ఒక కప్పు, మామూలు బియ్యం - రెండు కప్పులు, మినప్పప్పు-
అర కప్పు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర కట్టలు - రెండు,
అల్లం ముద్ద - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఉప్పు -
తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ఉప్పుడు బియ్యాన్ని
వేడినీళ్లలో ఉదయాన్నే నానపెట్టుకోవాలి. మామూలు బియ్యాన్ని చల్లటి నీళ్లలో
నానపెట్టుకోవాలి. మినప్పప్పు, శెనగపప్పుని కూడా నానపెట్టాలి. సాయంత్రం
అయ్యాక వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. మర్నాడు అల్లం, పచ్చిమిరపకాయలు,
ఉప్పు, కొత్తిమీర తురుముని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని
దోశలపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి ఈ పిండితో దోశలు
వేసుకోవాలి.
వడలు
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - రెండు కట్టలు, బంగాళదుంప - ఒకటి, నువ్వులు - 20 గ్రాములు,
వెల్లుల్లి రేకలు - మూడు, అల్లం - కొద్దిగా, ఉల్లిపాయ - చిన్నది,
పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం:
ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
బంగాళదుంపని ఉడికించి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె
పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు,
ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తరువాత బంగాళదుంప ముద్ద, కొత్తిమీర
తురుము కూడా వేసి వేగించి దించేయాలి. నువ్వుల్ని మిక్సీలో వేసి మెత్తగా
రుబ్బుకోవాలి. ఇందులో వేగించి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలపాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక వడలుగా వేసుకోవాలి.
డైమండ్స్
డైమండ్స్
కావలసిన పదార్థాలు: కొత్తిమీర
కట్టలు - రెండు, శెనగపిండి - ఒక కప్పు, నీళ్లు - ఒక కప్పు, వరిపిండి - ఒక
టేబుల్ స్పూను, వెల్లుల్లి రేకలు - ఎనిమిది, అల్లంముక్క - చిన్నది,
పచ్చిమిరపకాయలు - ఆరు, పసుపు - కొద్దిగా, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు -
తగినంత, నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
తయారుచేయు విధానం: ముందుగా
అల్లంవెల్లుల్లి, పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసుకుని ముద్ద చేసుకోవాలి.
కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో
శెనగపిండి, వరిపిండి, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి జారుగా కలిపి పక్కన
పెట్టుకోవాలి. పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి నూనె పోసి వేడెక్కాక
జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. తరువాత కొత్తిమీర తురుము
కూడా వేయాలి. కొద్దిగా వేగాక కలుపుకున్న పిండిని కూడా వేసి ఓ ఐదునిమిషాలు
ఉడికించి దించేయాలి. ఇప్పుడు పొయ్యిమీద పాన్ పెట్టుకుని సరిపడా నూనె పోసి ఈ
మిశ్రమాన్ని రొట్టె మాదిరిగా వేయాలి. సన్నని మంటపై రెండువైపులా
వేగించాలి. బాగా ఎర్రగా అయ్యాక దించేసి డైమండ్‌షేపులో ముక్కలు కట్
చేసుకోవాలి.
రోల్స్
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర తురుము - నాలుగు కప్పులు, శెనగపప్పు- 200 గ్రాములు, కొబ్బరి
తురుము - ఒక కప్పు, కందులు - రెండు టేబుల్ స్పూన్లు, గసగసాలు - రెండు టీ
స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - నాలుగు, పెరుగు - ఒక కప్పు,
గరం మసాలా - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - సరిపడా, నూనె -
సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా
కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో
కొబ్బరి తురుము, మెత్తగా దంచిన గసగసాలు, కందులు, ఉల్లిపాయముక్కలు,
పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన
పెట్టుకోవాలి. శెగనపిండిలో కూడా కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండిలా
కలుపుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకుని చపాతి చేసుకోవాలి. చపాతీలు పైభాగంలో
స్పూనుతో పెరుగు రాయాలి. మధ్యలో కొత్తిమీర మిశ్రమాన్ని పెట్టి
నాలుగువైపులా మూసేయాలి. ఇలా రోల్స్‌ని తయారుచేసుకుని ఇడ్లీ రేకులపై పెట్టి
ఓ పదినిమిషాలు ఉడికించి దించేయాలి. తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ
రోల్స్‌ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేగించి దించేయాలి.
చపాతీలు
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - నాలుగు కప్పులు, వెన్న - ఒక టేబుల్ స్పూను, కొత్తిమీర
తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె -
సరిపడా.
తయారుచేయు విధానం: కొత్తిమీరని
సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,
వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక
గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.Thankyou https://www.blogger.com/blogger.g?blogID=2304125271618913347#editor/target=post;postID=1479785938795914541
No comments:
Post a Comment