25 May 2015

పక్షవాత ముప్పును తప్పించుకోవచ్చు

పక్షవాత ముప్పును తప్పించుకోవచ్చు

అప్పటిదాకా ఆనందంగా అటూఇటూ తిరిగినవారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. కాళ్లూ, చేతులూ పడిపోయి వికలాంగుల్లా మారిపోతారు.. ఇంగ్లిష్‌లో పెరాలసిస్, వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్‌గా పిలిచే పక్షవాతం, ఉన్నట్టుండి మన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. మన దేశంలో సగటున 10శాతం మంది ఈ వ్యాధి బారినపడుతుండగా, అందులో కొందరు వికలాంగులై బతుకీడిస్తుంటే, మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకుంటే పక్షవాతం ముప్పును తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.- టీ మీడియా
Avoid the risk of stroke
30శాతం మందికి శాశ్వత వైకల్యం..
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిలో 30శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కాలు, చేయి ఆడకుండా మరొకరిపై ఆధారపడి బతుకీడుస్తున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్ రాకముందు, వచ్చాక పలు జాగ్రత్తలతో బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అవగాహన లోపంతోనే చాలా మంది పక్షవాతానికి గురైనట్లు ఇటీవల సదరమ్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అవగాహన కల్పిస్తే కొందరినైనా ఈ వ్యాధి బారి నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.
ముందుజాగ్రత్తే మందు..
పక్షవాతం వచ్చిన వారిలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒక కాలు, ఒక చేయి బలహీనంగా మారడం, మాట ముద్దముద్దగా రావడం, తూలుతూ నడవడం, మతిమరుపు ప్రధానంగా అగుపిస్తాయి. ఇవి 24గంటల లోపు తగ్గిపోతే ట్రాన్సియాంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. చాలా వరకు ఈ లక్షణాలు కొందరిలో గంట లోపే తగ్గిపోవచ్చు. అయినప్పటికీ భవిష్యత్‌లో ప్రమాదానికి సంకేతంగా భావించి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌లో రెండు రకాలు..
బ్రెయిన్ స్ట్రోక్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాల్లో అడ్డుతగలడం వల్ల అక్కడి భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక కొన్ని భాగాలు చచ్చు బడడం వల్ల వస్తుంది. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తం కారి వస్తుంది.
వ్యాధి కారకాలు ఇవి..
వ్యాధి కారకాల్లో రెండు రకాలుంటాయి. ఒకటి మార్పు చేసుకోలేనివి, రెండోది మార్చుకోదగ్గవి. మార్పు చేసుకోలేనివాటిలో ప్రధానంగా వయస్సు, లింగభేదం, కుటుంబ వారసత్వం ఉన్నాయి. మార్చుకోదగ్గవాటిలో రక్తపోటు, ధూమపానం, మద్యపానం, మధుమేహం, స్థూలకాయం లాంటివి ఉన్నాయి.
వయస్సు..
వయస్సు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. 50ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకు పక్షవాతం వచ్చే అవకాశం రెట్టింపవుతుంది. అందువల్ల ఈ వయస్సు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలి. తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
లింగభేదం..
పక్షవాతం వచ్చే అవకాశం మహిళల్లోకంటే పురుషుల్లో ఎక్కువ. అధిక శాతం పురుషులు మద్యపానం, ధూమపానం చేస్తుంటారు. దీంతో పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. 70ఏళ్లు దాటాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు స్త్రీ, పురుషుల్లో సమానంగా ఉంటాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.
వారసత్వంగా..
గతంలో కుటుంబంలోని ఎవరికైనా పక్షవాతం వస్తే వారి కుటుంబసభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్తపోటును నియంత్రించుకోవాలి..
మార్చుకోదగ్గ వ్యాధి కారకాలను కేవలం అవగాహనతో సరి చేసుకోవచ్చు. ఇందులో మొదటిది రక్తపోటు. సాధారణంగా మనిషికి ఉండాల్సిన రక్తపోటుకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మందులు వాడి అదుపులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల 45శాతం మందిలో పక్షవాతాన్ని నియంత్రిచొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణ వ్యక్తుల కంటే పొగతాగేవారిలో రెండు నుంచి నాలుగు రెట్లు వ్యాధి బారిన పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మద్యం తాగే అలవాటున్న స్త్రీ, పురుషులు రోజు రెండు పెగ్గులకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
మదుమేహాన్ని నియంత్రించుకోవాలి..
మధుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. మందులు ఎల్లప్పుడు వాడి షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి. లేని పక్షంలో పక్షవాతాన్ని ఆహ్వానించినట్లేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
స్థూలకాయంతో కూడా..
స్థూలకాయంతో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడితే పక్షవాతానికి చెక్‌పెట్టొచ్చు. స్థూలకాయులు వైద్యుల సూచనలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలి.
రెండు రకాల జాగ్రత్తలు..
ముందు జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం వచ్చిన వారిలో 70శాతం మంది మొదటిసారి స్ట్రోక్‌కు గురైన వారే ఉంటారు. మిగతా 30శాతం మంది స్ట్రోక్ తిరగబెట్టిన వారుంటారు. అందుకే నివారణలోనూ తొలిజాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఒకసారి పక్షవాతం వచ్చి రెండో సారి తిరగబెట్టకుండా తీసుకునే జాగ్రత్తలను తదుపరి జాగ్రత్తలుగా చెబుతున్నారు. తొలి జాగ్రత్తలు ఎంతో సులువనీ, వాటిని పాటించడం కూడా తేలికంటున్నారు.
తొలి జాగ్రతలివి..
l సాధారణంగా బీపీ 140/80 కన్నా తక్కుగా ఉండాలి. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పకుండా బీపీని 130/80లోపే ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులతో బీపీ పరీక్ష చేయించుకోవాలి.
l రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు తరచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించి మందులను వాడాలి.
l బ్రెయిన్ స్ట్రోక్‌ను నియంత్రించేందుకు వ్యాయామం తప్పని సరి. రోజుకు 30నిమిషాల చొప్పున ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. లేదా 45నిమిషాల చొప్పున వారంలో నాలుగు, ఐదు రోజులు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
l ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి. అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినొద్దు.
తదుపరి జాగ్రత్తలు..
తొలి జాగ్రత్తలు తీసుకుంటూనే గుండె జబ్బు ఉన్నవారు గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి ఉన్నా, పంపింగ్ శాతం తగ్గినా, సమస్యల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తదుపరి జాగ్రత్తలంటారు. మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు సన్నబడడాన్ని కెరటాడ్ అర్జరీ స్టెనోసిస్ అంటారు. ఒకసారి పక్షవాతానికి గురైన వారికి కెరటాడ్ అర్జరీ స్టెనోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. పక్షవాతానికి గురైన వారు సరైన వైద్యనిపుణున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

No comments:

Post a Comment